అమెరికా మార్కెట్లలో-'బేర్‌'- ట్రెండ్‌!

అమెరికా మార్కెట్లలో-'బేర్‌'- ట్రెండ్‌!

ప్రపంచానికే తలమానికంగా నిలిచే అమెరికా స్టాక్‌ మార్కెట్లను బేర్‌ ట్రెండ్‌ ఆవహించింది. దీంతో వరుసగా మూడో రోజు శుక్రవారం(21న) మార్కెట్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా డోజోన్స్‌ మళ్లీ 414 పాయింట్లు(1.8 శాతం) క్షీణించి 22,445 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 51 పాయింట్లు(2 శాతం) పతనమై 2,417 వద్ద ముగిసింది. వెరసి 2017 జులై కనిష్టాలకు చేరాయి. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 195 పాయింట్లు (3 శాతం) పడిపోయి 6,333 వద్ద స్థిరపడింది. గ్రేట్‌ డిప్రెషన్‌ తరువాత మళ్లీ డిసెంబర్‌ నెలలో ఎస్‌అండ్‌పీ గరిష్టస్థాయి నష్టాలను నమోదు చేసుకోనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క ఆగస్ట్‌ 29న నమోదైన గరిష్టం నుంచి నాస్‌డాక్‌ ఇప్పటివరకూ 22 శాతం దిగజారింది. ఈ బాటలో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఈ ఏడాది సెప్టెంబర్‌ గరిష్టాల నుంచి 17 శాతం చొప్పున పతనమయ్యాయి.

బేర్‌ గుప్పిట్లో
గత వారం(17-21) డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 7 శాతం చొప్పున కుప్పకూలగా.. నాస్‌డాక్‌ 8.4 శాతం కోల్పోయింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ, నాస్‌డాక్‌లలో లిస్టయిన 2,600 షేర్లు వారాంతాన ఏడాది కనిష్టాలకు చేరాయి. ముందురోజు సైతం మార్కెట్లు 2 శాతం పతనంకాగా.. 3,000 స్టాక్స్‌ 52 వారాల కనిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. ఇంతక్రితం ఆర్థిక సంక్షోభం చెలరేగిన 2008 అక్టోబర్‌లో మాత్రమే షేర్లు ఇలా దిగజారినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎఫ్‌అండ్‌వో విభాగం గడువు ముగిసిన నేపథ్యంలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. గత 20 రోజుల సగటు 8.81 బిలియన్‌ షేర్లతో పోలిస్తే వారాంతాన 15.18 బిలియన్‌ లావాదేవీలు నమోదయ్యాయి. దీంతో అమెరికా మార్కెట్లు బేర్‌ గుప్పిట్లో చిక్కుకున్నట్లేనని మార్కెట్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అధిక పీఈలలో ట్రేడవుతున్న టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ రంగాలు  ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి.

Image result for trade war

కారణాలేవిటంటే?
ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను చైనా సమూలంగా ప్రక్షాళన చేయవలసి ఉన్నదని వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవరో తాజాగా పేర్కొన్నారు. అలాకాకుంటే గడువులోగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారాలు కుదరడం కష్టమేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇప్పటికే వచ్చే ఏడాది సైతం వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడంతోపాటు.. బ్యాలన్స్‌షీట్‌లో కోతపెట్టనున్నట్లు ఫెడ్‌ పేర్కొనడంతో వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. మరోవైపు మెక్సికో సరిహద్దువద్ద గోడ నిర్మాణానికి కాంగ్రెస్‌ నాయకులు అంగీకరించకపోవడంతో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పాక్షిక షట్‌డౌన్‌కు నిర్ణయించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనయ్యారు. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ పావు శాతం వడ్డీ రేటును పెంచడంతో బుధ, గురువారాల్లో మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. 

Image result for nike inc

నైక్‌ హైజంప్‌
త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో స్పోర్ట్స్‌వేర్‌ దిగ్గజం నైక్‌ షేరు 7.2 శాతం జంప్‌చేసింది. అయితే ఫాంగ్ స్టాక్స్‌లో ఫేస్‌బుక్‌ 6.3 శాతం, అమెజాన్‌ 5.7 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 5.4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌, గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ సైతం 3 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. Most Popular