మొదటి మీటింగ్‌లో ఆర్బీఐ గవర్నర్ పెట్టుకున్న టార్గెట్లు ఇవే

మొదటి మీటింగ్‌లో ఆర్బీఐ గవర్నర్ పెట్టుకున్న టార్గెట్లు ఇవే

ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో సెంట్రల్ బోర్డ్ మీటింగ్ గత శుక్రవారం నాడు జరిగింది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న వివిధ అంశాల ఒత్తిడిపై ప్రధానంగా చర్చ జరిగింది. గత గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా తరువాతి పరిణామాల నేపధ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కానీ.. బోర్డు సమావేశానంతరం చర్చల విషయంలో ఆర్బీఐ నుండి ఎటువంటి సంపూర్ణ ప్రకటన విడుదల కాలేదు.
ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తొలి సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలకు నగదు లిక్విడిటీ, క్రెడిట్ సరఫరా వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. కీలక అంశాలపై కేంద్రంతో సయోధ్యపై కూడా చర్చ జరిగింది. ఆర్బీఐ పాలన ప్రణాళికతో బాటు బోర్డు పునర్‌నిర్మాణంపై కూడా చర్చ జరిగింది. కానీ.. బోర్డు విషయంలో అసంపూర్తిగానే చర్చలు ముగిసాయని ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి.
శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో పాలన వ్యవస్థపై మరిన్ని చర్చలు, మరింత పరిశీలన జరపడానికి బోర్డు అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో ఆర్‌బీఐ యాజమాన్య పరంగా ఇబ్బందులకు గురిచేసిన అంశాలు, ఇతర అంశాలపై జరిగిన చర్చలను గవర్నర్ శక్తికాంత్ దాస్‌ ఆసక్తిగా విన్నట్టు సమాచారం.


నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు ద్రవ్యలభ్యత, రుణ లభ్యత, కరెన్సీ మేనేజ్‌మెంట్‌,  ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలనూ బోర్డు సమీక్షించినట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ పాలన వ్యవస్థపై బోర్డు చర్చించింది. ఈ విషయంపై మరింత పరిశీలన అవసరమని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ మిగతా అంశాలపై చర్చలు ఏవిధంగా సాగాయో  మాత్రం వెల్లడించలేదు.  
గత ఆర్ధిక సంవత్సరం బ్యాంకింగ్‌ ధోరణులు, ప్రగతిపై వెలువడిన ముసాయిదా నివేదికపై 18 సభ్యుల బోర్డు చర్చించింది. అంతక్రితం నవంబరు 19న జరిగిన బోర్డు సమావేశంలో ఆర్థిక మూలధన ప్రణాళిక ( ECF ) పై సరైన స్థాయిని నిర్ణయించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏదైనా ఒక సమయంలో ఆర్‌బీఐ దగ్గర ఉంచుకోవాల్సిన అత్యవసర నిధుల పరిమాణాన్ని ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి నిర్ణయించడానికీ బోర్డు అంగీకారం తెలిపింది. గత సమావేశంలో PCA వ్యవస్థ నిబంధనలను సడలించడానికీ బోర్డు అంగీకరించింది. అయితే ఈ విషయాల్లో ప్రభుత్వం, ఆర్‌బీఐలు ఇంకా ముందడుగు వేయలేదని సమాచారం. జూన్‌ 2018 నాటికి రూ.9.43 లక్షల కోట్లుగా ఉన్న ఆర్‌బీఐ అదనపు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న దానిపై కూడా ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఉర్జిత్‌ నిష్క్రమణకు ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, కొన్ని కీలక అంశాలపై జనవరి మధ్యలో జరిగే తదుపరి సమావేశంలో అధికారిక ప్రతిపాదనలు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

 Most Popular