దిలీప్‌ బిల్డ్‌కాన్‌, ఎడిల్‌వీజ్‌ లాభాల్లో

దిలీప్‌ బిల్డ్‌కాన్‌, ఎడిల్‌వీజ్‌ లాభాల్లో

సరికొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ షేరు కళకళలాడుతుంటే.. మరోపక్క ఎన్‌సీడీల జారీ ద్వారా నిధులను సమీకరించనున్న వార్తలతో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్‌ సైతం సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం... 

దిలీప్‌ బిల్డ్‌కాన్‌
పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియాకు అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి తాజాగా కాంట్రాక్టు లభించినట్లు దిలీప్‌ బిల్డ్‌కాన్‌ పేర్కొంది. దీంతో ఈ షేరు ప్రస్తుతం దాదాపు 3 శాతం పెరిగి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 451 వద్ద గరిష్టాన్నీ, రూ. 433 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఒడిషాలోని శ్యామలేశ్వరి ఓసీపీలో ఓబీ రిమూవల్‌ కాంట్రాక్ట్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌ పనుల కోసం రూ. 1000 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించినట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 75.63 శాతం వాటా ఉంది.

Image result for Edelweiss Financial Services Ltd.

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ 
సొంత అనుబంధ సంస్థ ఈసీఎల్‌ ఫైనాన్స్‌ ద్వారా మార్పిడికి వీలుకాని సెక్యూర్డ్‌డ్‌ రీడీమబుల్‌ డిబెంచర్లను జారీ చేయనున్నట్లు ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ పేర్కొంది. తద్వారా రూ. 1,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఈ నెల 13న ఎన్‌సీడీల జారీ ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 33.02 శాతం వాటా ఉంది. ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయనున్న ఎన్‌సీడీలకు 10.2 శాతం ఈల్డ్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ షేరు 2 శాతం పెరిగి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 192 వరకూ ఎగసింది.