భారీ ట్రేడింగ్‌- షేర్లు మైనస్‌

భారీ ట్రేడింగ్‌- షేర్లు మైనస్‌

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా భారీ నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ట్రేడింగ్‌ పరిమాణం భారీగా నమోదవుతోంది. దీంతోపాటు పలు కౌటర్లు బలహీనపడగా.. వక్రంగీ లిమిటెడ్‌ లాభాలతో కదులుతోంది. వివరాలు చూద్దాం.. 

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌: ఈ కౌంటర్లో బ్లాక్‌డీల్‌ జరిగింది. దీంతో 14.2 లక్షల షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. ప్రస్తుతం సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం పతనమైంది. రూ. 15.20 వద్ద ట్రేడవుతోంది.

యస్‌ బ్యాంక్‌: బ్లాక్‌డీల్‌ ద్వారా 10.8 లక్షల యస్‌ బ్యాంక్‌ షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.3 శాతం వెనకడుగు వేసింది. రూ. 169 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 172.5-167.4 మధ్య ఊగిసలాడింది.

డిష్‌ టీవీ: ఈ కౌంటర్లో బ్లాక్‌డీల్‌ జరిగినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. మొత్తం 60.8 లక్షల షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిష్‌ టీవీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.7 శాతం క్షీణించింది. రూ. 34.30 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 33.35 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌: బ్లాక్‌డీల్‌ ద్వారా 22.6 లక్షల షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. దీంతో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.2 శాతం నీరసించి రూ. 143 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 145-141 మధ్య ఊగిసలాడింది.

వక్రంగీ లిమిటెడ్‌: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వక్రంగీ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇటీవల జోరు చూపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. షేరు ధర మ్యానిప్యులేషన్‌ కేసులో సెబీ క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఈ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. నేటి ట్రేడింగ్‌లోనూ 5 శాతం ఎగసి రూ. 39ను తాకింది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ట్రేడింగ్‌ పరిమాణం 9 రెట్లు ఎగసింది.Most Popular