సెన్సెక్స్‌ 400 పాయింట్లు పతనం

సెన్సెక్స్‌ 400 పాయింట్లు పతనం

చైనీస్‌ టెక్‌ దిగ్గజం హువే డిప్యూటీ చైర్మన్‌ను అమెరికా అభ్యర్ధన మేరకు కెనడియన్‌ అధికారులు అరెస్ట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో అమెరికా, చైనా మధ్య తిరిగి వాణిజ్య వివాదాలు చెలరేగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. ఫలితంగా ఆసియాలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అన్ని మార్కెట్లూ క్షీణపథం పట్టాయి. వెరసి దేశీయంగానూ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 401 పాయింట్లు పతనమై 35,483కు చేరింది. నిఫ్టీ సైతం 134 పాయింట్లు కోల్పోయి 10,648 వద్ద ట్రేడవుతోంది.

రియల్టీ, ఐటీ, ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. ప్రధానంగా రియల్టీ, ఆటో, ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ 2.5-1.2 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 5.2 శాతం పతనంకాగా.. మారుతీ, టెక్‌ మహీంద్రా, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌ 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. 

Image result for sensex down
 
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌సీసీ దాదాపు 9 శాతం కుప్పకూలగా.. ఆర్‌కామ్‌, జస్ట్‌డయల్‌, ఓబీసీ, సీజీ పవర్‌, పీసీ జ్యువెలర్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 5.3-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క సీమెన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, టొరంట్‌ పవర్‌, యూబీఎల్‌, బాష్‌, చెన్నై పెట్రో, సెయిల్‌, సన్‌ టీవీ 1.5-0.6 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, శోభా 4.5-2 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.3 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1536 నష్టపోగా.. 498 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular