వాణిజ్య వివాద భయాలు- సరికొత్త షాక్‌!

వాణిజ్య వివాద భయాలు- సరికొత్త షాక్‌!

చైనీస్ టెక్నాలజీ దిగ్గజం హువే డిప్యూటీ చైర్మన్‌ మెంగ్‌ వాన్‌జూను తమ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు కెనడియన్‌ న్యాయ శాఖ తాజాగా వెల్లడించింది. యూఎస్‌ ప్రభుత్వ అభ్యర్ధనమేరకు మెంగ్‌ను అరెస్ట్‌చేసినట్లు కెనడియన్‌ న్యాయ శాఖ పేర్కొంది. ఆమెను యూఎస్‌కు అప్పగించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఇప్పటికే అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విభేధాలు మరింత ముదిరే అవకాశమున్నట్లు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. వాణిజ్య వివాదాలకు చెక్‌పెట్టేందుకు వీలుగా గత వారాంతాన యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌, చైనీస్ చీఫ్‌ జిన్‌పింగ్‌ సమాలోచనలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మూడు నెలల గడువును సైతం విధించుకున్నారు. అయితే తాజా పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో సెంటిమెంటును దెబ్బకొట్టనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ పతనంకాగా.. బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు సైతం 1.5 శాతం చొప్పున తిరోగమించాయి. కాగా.. దివంగత అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ సీనియర్‌ బుష్‌కు నివాళిగా బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు.  

Image result for world stocks down

ఆసియా నేలచూపు
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, ప్రపంచ వృద్ధిపై ఆందోళనల కారణంగా ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ నీరసించాయి. హాంకాంగ్ దాదాపు 3 శాతం పతనంకాగా.. తైవాన్‌, జపాన్, చైనా, సింగపూర్‌, కొరియా, థాయ్‌లాండ్‌ 2-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇండొనేసియా మాత్రమే అదికూడా నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది. కాగా.. యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌, డాలరు ఇండెక్స్‌ మరోసారి స్వల్పంగా బలహీనపడ్డాయి. జపనీస్‌ యెన్‌ 113కు చేరగా.. యూరో 1.13ను తాకింది. చైనీస్‌ యువాన్‌ 6.86 వద్ద ట్రేడవుతోంది.  Most Popular