లుపిన్‌, సన్‌ ఫార్మా నేలచూపు

లుపిన్‌, సన్‌ ఫార్మా నేలచూపు

మధ్యప్రదేశ్‌లోని మణిదీప్‌ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ లోపాలు గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్‌) వెల్లడికావడంతో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క ప్రమోటర్‌ సంఘ్వీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుపై వివరణ ఇచ్చినప్పటికీ సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాలు చూద్దాం..

లుపిన్‌ లిమిటెడ్‌
మణిదీప్‌ ప్లాంటులో నవంబర్‌ 26- డిసెంబర్‌ 4 మధ్య తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ లోపాలను గుర్తించినట్లు లుపిన్ లిమిటెడ్‌ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.25 శాతం క్షీణించి రూ. 868 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 845 వద్ద ఇంట్రాడే  కనిష్టానికి చేరింది. మణిదీప్‌ ప్లాంటులోని కార్డియోవాస్కులర్‌ ఏపీఐ యూనిట్లో 4, సెఫలోస్పోరిన్‌ ఏపీఐల విభాగంలో 10, సెఫలోస్పోరిన్‌ సోలిడ్‌ ఓరల్‌ డోసేజీ యూనిట్లో 8 చొప్పున యూఎస్‌ఎఫ్‌డీఏ లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా.. వీటి నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు లుపిన్‌ తెలియజేసింది. 

Related image

సన్ ఫార్మాస్యూటికల్‌
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును తిరిగి సమీక్షించనున్నట్లు వెలువడ్డ వార్తల నేపథ్యంలో సన్‌ ఫార్మా కౌంటర్‌ మరోసారి బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సన్‌ ఫార్మా షేరు దాదాపు 4 శాతం పతనమైంది. రూ. 427 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 425 దిగువన ఐదేళ్ల కనిష్టానికి చేరింది. ఇంతక్రితం 2013 ఏప్రిల్‌లో మాత్రమే సన్‌ ఫార్మా షేరు ఈ స్థాయిలో ట్రేడయ్యింది. కాగా.. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, విజిల్‌ బ్లోవర్‌ అంశాలపై ఇప్పటికే కంపెనీ యాజమాన్యం వివరణ ఇచ్చినప్పటికీ గత మూడు రోజుల్లో సన్‌ ఫార్మా షేరు 12 శాతం పతనంకావడం గమనార్హం! వివిధ ప్రతికూలతల నడుమ గత మూడు నెలల కాలాన్ని పరిగణిస్తే ఈ షేరు 36 శాతం తిరోగమించింది.Most Popular