ప్రణాళిక రివర్స్‌?- పీఎఫ్‌సీ పతనం 

ప్రణాళిక రివర్స్‌?- పీఎఫ్‌సీ పతనం 

విద్యుత్‌ రంగ యుటిలిటీ సంస్థలు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) లిమిటెడ్‌ను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే తొలుత ఆర్‌ఈసీలో పీఎఫ్‌సీని విలీనం చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడగా.. ప్రస్తుతం ప్రణాళికలు రివర్స్‌ అయినట్లు తెలుస్తోంది. వెరసి పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీని విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎఫ్‌సీ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 94 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఆర్‌ఈసీ షేరు సైతం 1 శాతం నీరసించి రూ. 105 వద్ద కదులుతోంది. ఇతర వివరాలు చూద్దాం...

Image result for PFC ltd

ఆర్‌ఈసీ విలీనం?
పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీని విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. 2019 మార్చికల్లా ఆర్‌ఈసీలో మెజారిటీ వాటాను  పీఎఫ్‌సీ సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఈసీలో మెజారిటీ వాటా విలువను సుమారు రూ. 14,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. గతంలో హెచ్‌పీసీఎల్‌లో వాటాను ఓఎన్‌జీసీ కొనుగోలు చేసిన విధానంలోనే ఆర్‌ఈసీ వాటాను పీఎఫ్‌సీ కొనుగోలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  

Image result for REC ltd

నేడు మీటింగ్
ఆర్‌ఈసీ బోర్డు నేడు(5న) వాటాదారుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను సమావేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా..  ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వానికి 65.6 శాతం వాటా ఉంది. మరోవైపు ఆర్‌ఈసీలో 58 శాతం వాటాను సైతం కలిగి ఉంది. ఈ విలీనం ద్వారా బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ. 80,000 కోట్ల సమీకరణలో భాగంగా ప్రభుత్వం కొంతమేర నిధులు సమకూర్చుకోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 32,247 కోట్లను సమకూర్చుకున్న విషయం విదితమే.  Most Popular