వాణిజ్య వివాద పరిష్కార అంచనాలతో వరుసగా రెండు రోజులపాటు లాభాల హైజంప్ చేసిన అమెరికా స్టాక్ మార్కెట్లలో మంగళవారం ఉన్నట్టుండి భారీ అమ్మకాలకు తెరలేచింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. గత కొంతకాలంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగడంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలు బలపడుతున్నాయి. మరోపక్క వాణిజ్య వివాదాల పరిష్కారానికి మూడు నెలలు గడువు విధించుకున్నప్పటికీ అమెరికా, చైనా మధ్య ఒప్పందం కుదిరే అంశంపై సందేహాలు తలెత్తుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి.
3 శాతం పతనం
మంగళవారం డోజోన్స్ 799 పాయింట్లు(3 శాతం) పతనమై 25,027 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 90 పాయింట్లు(3.25 శాతం) పడిపోయి 2700 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 283 పాయింట్లు(దాదాపు 4 శాతం) కుప్పకూలి 7,158 వద్ద స్థిరపడింది. ఈ బాటలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్ 2000 గత ఏడేళ్లలో ఎరుగని విధంగా 4.4 శాతం తిరోగమించింది. శుక్రవారం దివంగతులైన మాజీ ప్రెసిడెంట్ సీనియర్ బుష్కు నివాళులు అర్పిస్తూ నేడు అమెరికా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు.
ఇండస్ట్రియల్స్ డౌన్
బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్, ట్రాన్స్పోర్ట్ రంగాలు ప్రధానంగా అమ్మకాలతో దెబ్బతిన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్ స్టాక్స్ లో... బోయింగ్ 5 శాతం పతనంకాగా.. కేటర్పిల్లర్ 7 శాతం కుప్పకూలింది.
ఆసియా వీక్
యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ బలహీనపడటంతోపాటు, డాలరు ఇండెక్స్ 96.37 వరకూ నీరసించింది. జపనీస్ యెన్ 0.75 శాతం బలపడి 112.86కు చేరగా.. బ్రెక్సిట్ ఆందోళనల కారణంగా యూకే పౌండ్ 17 నెలల కనిష్టం 1.265ను తాకింది. కాగా.. ప్రపంచ వృద్ధిపై ఆందోళనల కారణంగా ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ నీరసించాయి. తైవాన్, హాంకాంగ్, సింగపూర్, ఇండొనేసియా, చైనా, జపాన్, కొరియా 1.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. థాయ్లాండ్ నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది.