ఈ వారం ఆర్‌బీఐ, జీడీపీ ఎఫెక్ట్‌!

ఈ వారం ఆర్‌బీఐ, జీడీపీ ఎఫెక్ట్‌!

దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం(3-7) ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలు, రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టనున్న పాలసీ సమీక్ష నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయి. శుక్రవారం(నవంబర్‌ 30) మార్కెట్లు ముగిశాక కేంద్ర గణాంకాల కార్యాలయం సెప్టెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే దిగువన అంటే 7.1 శాతం వృద్ధి చూపింది. గత మూడు త్రైమాసికాలతో పోలిస్తే ఇది కనిష్టంకాగా.. పలువురు ఆర్థికవేత్తలు 7.5 శాతం పురోగతిని ఆశించారు. అయినప్పటికీ ప్రపంచంలోనే వేగవంత వృద్ధి సాధిస్తున్న ఎకానమీగా నిలవడం విశేషం!  కాగా.. జూన్‌ క్వార్టర్‌లో జీడీపీ 8.2 శాతం ఎగసింది. చమురు ధరలు, రూపాయి బలహీనత, లిక్విడిటీ తదితర అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి జీడీపీ ప్రభావం సోమవారం(3న) మార్కెట్లపై కనిపించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Image result for Indian gdp

5న పాలసీ సమీక్ష
రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) రెండు రోజులపాటు పరపతి సమీక్షను చేపట్టనుంది. 3న ప్రారంభమై 5న ముగియనున్న సమావేశంలో ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఎంపీసీ కట్టుబడవచ్చని అధిక శాతం మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల చమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటం, ద్రవ్యోల్బణ అంచనాలు, జీడీపీ వంటి అంశాలు ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో ప్రభావం చూపే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. అక్టోబర్‌ పాలసీలోనూ యథాతథ రేట్ల అమలుకు ఎంపీసీ నిర్ణయించిన విషయం విదితమే. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్‌బీఐ లక్ష్యానికంటే దిగువనే నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు!

Image result for us china trade war

విదేశీ అంశాలూ కీలకమే
నేడు(శనివారం) అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వాణిజ్య వివాదాలపై చర్చలు నిర్వహించే అవకాశముంది. మరోవైపు దేశీయంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 7తో ముగియనుంది. ఇప్పటికే చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరంలో ఎన్నికలు ముగియగా.. రాజస్తాన్, తెలంగాణలో 7న పోలింగ్‌ జరగనుంది. దీంతో వచ్చే వారం ఫలితాల అంచనాలు(ఎగ్జిట్‌ పోల్స్‌) వెల్లడికానున్నాయి. వీటికితోడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి మారకం, చమురు ధరలు వంటి పలు ఇతర అంశాలుసైతం సెంటిమెంటును ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు వివరించారు.Most Popular