డిసెంబర్ మొదటి వారంలో ప్రభావం చూపనున్న స్టాక్స్ ఇవే...!

డిసెంబర్ మొదటి వారంలో ప్రభావం చూపనున్న స్టాక్స్ ఇవే...!

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల, రూపీ బలపడటం వంటి కారణాలతో దేశీయ మార్కెట్లు కాస్త పుంజుకున్నాయి. నిఫ్టీ సెన్సెక్స్ కూడా 0.7 నుండి 0.15 శాతం పుంజుకోడంతో రానున్న వారం రోజుల్లో కొన్ని షేర్లు ప్రభావవంతంగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అవేంటో చూద్దాం..!


రెప్కో హోమ్ ఫైనాన్స్:
వాల్యూ ఇన్వెస్టర్‌ మోహనీష్ పబ్రాయిస్ ఫండ్ , తన వద్ద ఉన్న 9.5 లక్షల రెప్కో షేర్లను గురువారం నాడు విక్రయించింది. పబ్రాయి ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ IVLP ఒక్కో షేర్ ధర రూ.335.59 చొప్పున 3.85 లక్షల షేర్లను విక్రయించిందని BSE తెలిపింది .


SBI
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  SBI జనరల్ ఇన్సూరెన్స్ లో ఉన్న  వాటాలలో 4 శాతం విక్రయించడానికి సమ్మతించింది. దేశంలోని రెండు ప్రముఖ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (AIFs)  ఈ వాటాలను రూ. 482 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు సమాచారం.


ఎస్ బ్యాంక్
రాణా కపూర్ CEO గా కొనసాగలేక పోయినా.. వచ్చే మాసంలో ఎస్‌బ్యాంక్‌కు కొత్త ఛైర్మన్ రానున్నారని ప్రకటించారు. అంతేకాకుండా కుటుంబ వివాదాలు కూడా పరిష్కారం దిశగా సాగుతున్నాయనీ, గత నెలలో అశోక్ చావ్లా రాజీనామా బ్యాంక్‌పై ప్రభావం చూపబోదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.


స్పైస్‌జెట్
కొన్ని ఆర్ధక పరమైన చిక్కులతో సతమతమౌతున్న స్పైస్ జెట్ వాటిని అధిగమించే యత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే గతంలో సంస్థలో కీలకమైన అజయ్ సింగ్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి ఎన్నుకుంది. కంపెనీని లాభాల బాటలో పెట్టడానికి  అజయ్‌ సింగ్ ఈ పదవికి పూర్తిగా అర్హుడని స్పైస్‌ జెట్ భావిస్తుంది.


ఫ్యూచర్ రిటైల్ ;
భారతీ ఎంటర్ ప్రైజెస్‌ తన వద్దనున్న 57 లక్షల ఫ్యూచర్ రిటైల్ షేర్లను రూ. 300 కోట్లకు మార్కెట్ లో విక్రయించింది. వీటిని ఎడల్వీస్ గ్రూప్ వంటి కంపెనీలు కొన్నాయని సెబీ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఈ షేర్లు ఒక్కోటి రూ. 525.9 చొప్పున రూ. 299.3 కోట్ల విలువైనవిగా BSE తెలిపింది.


బ్యాంక్ ఆఫ్‌ బరోడా
ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఉద్యోగుల కోసం మరో రూ.10 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ షేర్లు ఉద్యోగుల షేర్ల కొనుగోళ్ళ పథకం కిందకు వస్తాయని బ్యాంక్ తెలిపింది.


సన్ ఫార్మా:
సెబీ చేసిన ఆరోపణలపై సన్ ఫార్మా వివరణనిస్తూ.. సెబీ అడిగిన అన్ని రకాల సమాచారాన్ని అందజేశామని, పారదర్శక వ్యాపారమే తమ ఉన్నతికి కారణమని సన్ ఫార్మా ఓ ప్రకటనలో తెలిపింది. సెబీ గతంలో సెక్షన్ 30 కింద(LODR) సన్ ఫార్మాకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.


ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్‌:
తాజాగా ఈ కంపెనీకి రూ. 27.65 కోట్ల విలువైన ONGC ఆర్డర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి ONGC లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌ను ఏషియన్ ఆయల్ ఫీల్డ్ సర్వీసెస్‌కు పంపింది. 2D సెస్మిక్ డాటా నిర్మాణం, నిర్వాహణలలో ఈ కాంట్రాక్ట్‌ను ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ దక్కించుకుంది.


ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ :
NBFC కంపెనీ అయిన ఇండియా బుల్స్ రూ. 200 కోట్ల ఫండ్‌ను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా సమీకరించుకుంది.  ఈ డిబెంచర్స్ ఫేస్ వాల్యూ రూ. 10 లక్షలుగా ఉంది, మొత్తం ఫండ్ రూ.200 కోట్లను సమీకరించుకున్నామని ఇండియా బుల్స్ పేర్కొంది.