పెరుగుతున్న రోగాలు, తగ్గుతున్న డిమాండ్ ! ఓ'రొయ్యో...!

పెరుగుతున్న రోగాలు, తగ్గుతున్న డిమాండ్ ! ఓ'రొయ్యో...!

సీ ఫుడ్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న రొయ్యల సాగు నానాటికీ తీసికట్టుగా మారుతుంది. ఇప్పటికే రెండో పంట సాగు విషయంలో రొయ్యల పెంపకం దారులు వెనకాడుతున్నారు. రొయ్యల ఎగుమతులకు డిమాండ్ తగ్గడం, పెంచుతున్న రొయ్యలు రోగాల బారిన పడుతుండటంతో రైతులు ఈ సాగు విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రొయ్యల్లో వైట్ ఫేస్ సిండ్రోమ్, EHP (పాథోజెన్ ) వంటి వైరస్‌ల వల్ల రొయ్యల ఉత్పత్తి దాదాపు 15-20శాతం తగ్గిపోయిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా వచ్చే జనవరి నాటికి రొయ్యల రెండో సాగు చేతికి రావాల్సి ఉందని, కానీ.. అంతర్జాతీయంగా ఎగుమతుల డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడంతో అత్యధిక రొయ్యల సాగు దారులు రెండో పంటను వెయలేదని రైతులు అంటున్నారు.

దేశీయంగా రొయ్యల ఉత్పత్తులు 6.5 లక్షల టన్నులుగా ఉండేదని, కానీ ఈ సారి అది దాదాపు 20శాతం తగ్గిందని ఆల్ ఇండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ (AISHA) పేర్కొంది. పంట తగ్గినా దేశీయంగా రొయ్యలకు డిమాండ్ ఉంది. ధరలు కూడా తగ్గుముఖం పట్టలేదు. సుమారు 30 రొయ్యలు ఉన్న 1 kg ధర రూ. 420గానూ, 100 రొయ్యలున్న కేజీ ధర రూ. 210గానూ ఉంది.
చలికాలంలో వైరస్‌లు అధికం..
 ఇప్పుడు చలికాలం మొదలు కావడంతో రెండో పంట వేయడానికి పెంపకం దారులు జంకుతున్నారు. ఈ చలిలో రొయ్యల దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని , అంతేకాకుండా వైరస్‌లు కూడా జోరుమీదుంటాయని , చెరువులో రొయ్య పిల్లలు వెంటనే వీటి బారిన పడతాయని AISHA ప్రతినిధులు తెలిపారు. దేశంలో సీఫుడ్ ఎగుమతుల్లో రొయ్యలదే అగ్రస్థానం. వీటి ఎగుమతుల వల్ల ప్రపంచంలోనే అతి పెద్ద రొయ్యల ఎగుమతి దారుగా మనదేశానికి పేరుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్యకాలంలో రొయ్యల ఎగుమతులు 6.35 శాతం పెరిగాయి. కానీ రెండో పంట సాగు తగ్గడంతో ఈ జనవరికి ఎగుమతులు చాలా వరకూ తగ్గుముఖం పట్టొచని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో సీఫుడ్ ఎగుమతుల ద్వారా మన దేశం 7.8 మిలియన్ డాలర్ల వర్తకం చేసింది. ఈ ఎగుమతుల్లో అత్యధికంగా 41.10శాతం వాటా  రొయ్యల ఎగుమతులవే. మన దేశం నుండి ఎగుమతయ్యే రొయ్యల్లో, ఐస్‌లో భద్రపరిచిన రొయ్యలను అత్యధికంగా అమెరికానే దిగుమతి చేసుకుంటుంది.  ఆతరువాతి స్థానాల్లో సౌత్ ఈస్ట్ ఏషియా, EU, జపాన్ , చైనాలు ఉన్నాయి.


ఎగుమతుల డిమాండ్ తగ్గింది...
క్రిస్టమస్ సీజన్ వస్తున్నప్పటికీ.. అంతర్జాతీయంగా మనకు ఎగుమతులకు ఆర్డర్లు రావడం లేదని, ఓవర్‌సీస్ మార్కెట్లలోనూ రొయ్యలకు డిమాండ్ తగ్గిందని  అఖిల భారత సీఫుడ్ ఎగుమతిదారుల సంఘం తెలిపింది. డాలర్ల మారకంతో పోలిస్తే.. ఎగుమతుల ఆర్డర్లు దాదాపు 7శాతం తగ్గాయనీ, EU మార్కెట్ల నుండి యాంటీ బయోటిక్స్ కారణాల వల్ల ఎగుమతుల ఆర్డర్లు రావడం లేదని సీఫుడ్ ఎగుమతుల సంఘం పేర్కొంది. దీని వల్ల మనకు రావల్సిన రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి ఈ సమస్యను కేంద్ర మంత్రిత్వ శాఖ వద్దకు తీసుకెళ్తున్నామని అసోసియేషన్ అంటోంది. యూరోపియన్ యూనియన్, అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ మన దేశపు రొయ్యల క్వాలిటీ విషయంలో అనుమానపడుతున్నాయని,  మన దేశం నుండి ఎగుమతి అయ్యే రొయ్యల నాణ్యత బాగుంటుందని ప్రభుత్వమే ఒక ప్రకటన చేయాల్సి ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఈ సమస్య మీద మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలపింగ్ అథారిటీ (MPEDA)  తగు చర్యలను తీసుకోడం మొదలెట్టింది. ఎగుమతి చేసే రొయ్యల్లో యాంటీబయాటిక్స్ ను తీసివేస్తున్నామని, దీనిపై అవగాహన కల్పించేందుకు చెన్నై, కేరళ, ఒంగోలు, కాకినాడల్లో ఎవేర్‌నెస్ క్యాంపైన్లు కూడా నిర్వహిస్తున్నామని AISHA, MPEDA తెలిపాయి. రొయ్యల నాణ్యత మన దేశంలోనే ఎక్కువగా ఉంటుందని, ఇతర దేశాల మార్కెట్లలో అపోహలు పెరిగిపోడంతోనే ఎగుమతుల ఆర్డర్లు తగ్గిపోయాయని అసోసియేషన్ అభిప్రాయపడింది. దాదాపు 500 రొయ్యల హేచరీస్ వీటి పెంపకంలో యాంటీబయాటిక్స్‌ను విరివిగా వాడుతున్నారు.
యాటీబయాటిక్స్ అవశేషాలు ఎక్కువ...
వైరస్‌లు సోకకుండా ఇచ్చే ఈ యాంటీబయాటిక్ అవశేషాలు రొయ్యల శరీరంలోనే ఉండిపోడంతో USDFA చాలా సార్లు అభ్యంతరం తెలిపింది, ఎగుమతులను కూడా అడ్డుకుంది. వాస్తవానికి మన దేశం నుండి ఎగుమతి అయ్యే టైగర్ ప్రాన్స్ మిగత రొయ్యల కంటే నాణ్యత, రుచిలో బాగుంటాయని, అమెరికా కూడా ఇప్పుడిప్పుడే భారత రొయ్యల దిగుమతుల మీద సానుకూల వైఖరిని ప్రదర్శిస్తుందని కొచ్చీ కేంద్రంగా పనిచేసే ఎగుమతి సంస్థలు పేర్కొంటున్నాయి. మన దేశం నుండి సరఫరా అయ్యే రొయ్యల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా దేశాలు రొయ్యల సాగులోకి దిగాయి. ఇది కూడా మన ఆర్డర్లను తగ్గిపోయేలా చేయడంలో ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రూపీ పతనం వల్ల లాభాపడేది ఒక్క రొయ్యల ఎగుమతుల రంగమేననీ, రొయ్యల ముడి సరుకు ఎగుమతుల్లో రూపీ మారకపు విలువ తగ్గడంతో ధరలు కూడా లాభదాయకంగా ఉంటాయని అమెరికన్ బేస్‌డ్ కంపెనీ డ్రిప్ క్యాపిటల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ నుండి ఎగుమతయ్యే రొయ్యలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గత నాలుగు క్వార్టర్లలో ఆంధ్రప్రదేశ్ నుండే ఎక్కువగా రొయ్యలు ఎగుమతి కాబడ్డాయి.
మనదేశానికి ప్రధానంగా చైనా , ఈక్వెడార్, థాయిల్యాండ్, వియాత్నం నుండి పోటీ ఉంది. వీరి పోటిని అధిగమించి అగ్రస్థానంలో మనం నిలవాలంటే ప్రభుత్వ సహాయం తప్పనిసరి అని రొయ్యల పెంపకం దారులు, ఎగుమతి దారులు భావిస్తున్నారు. రొయ్యల ఎగుమతుల వ్యాపారం ఎక్కువగా డాలర్ల మారకంతో జరుగుతుంది కాబట్టి అది మన ఫారెక్స్ నిల్వలకు కూడా మద్దతుగా నిలుస్తుంది.

 Most Popular