చమురు ధరలు- 'థాంక్స్‌' గివింగ్‌!

చమురు ధరలు- 'థాంక్స్‌' గివింగ్‌!

అమెరికాలో థాంక్స్‌ గివింగ్‌ డే రోజు.. అంటే శుక్రవారం(23న) మరోసారి ముడిచమురు ధరలు  పతనమయ్యాయి. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ దాదాపు 8 శాతం కుప్పకూలగా.. లండన్‌ మార్కెట్లోనూ బ్రెంట్‌ బ్యారల్‌ చమురు 6 శాతం పడిపోయింది. దీంతో నైమెక్స్‌ బ్యారల్‌ 4.2 డాలర్లు దిగజారి 50.42 డాలర్లకు చేరగా.. బ్రెంట్‌ బ్యారల్‌ సైతం 3.8 డాలర్లు కోల్పోయి 58.80 డాలర్ల వద్ద స్థిరపడింది. ధరలు 2017 అక్టోబర్‌ తరువాత కనిష్టానికి చేరగా.. ఇండియాకు థాంక్స్‌ గివింగ్‌ డేగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 

2014 జనవరి తరువాత
శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు బేర్‌మన్నాయి. నైమెక్స్‌ 11 శాతం, బ్రెంట్‌ 12 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో వరుసగా ఏడో వారంలోనూ చమురు ధరలు నేలచూపులకే పరిమితమయ్యాయి. ఫలితంగా 2016 జనవరి తరువాత నైమెక్స్‌, 2015 జనవరి తరువాత బ్రెంట్‌ అధికశాతం నష్టాలను నమోదు చేసుకున్నాయి. 7 వారాల్లో 30 శాతం పతనంకాగా..  2014 తరువాత ఒక నెలలో చమురు ధరలు 22 శాతం పడిపోవడం గమనించదగ్గ అంశమని ఇంధన రంగ విశ్లేషకులు చెబుతున్నారు!

Image result for opec

ఆయిల్‌ దేశాల మీటింగ్‌?
చమురు ధరల భారీ పతనం నేపథ్యంలో ఒపెక్‌ దేశాలు వారం రోజుల ముందుగానే సమావేశంకావాలని నిర్ణయించుకున్నాయి. నిజానికి డిసెంబర్‌ 6న వియత్నాంలో సమావేశాన్ని నిర్వహించనున్నాయి. అయితే అంతకుముందే అర్జెంటీనా బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరగనున్న జీ20 దేశాల సమావేశాల్లో చమురు ధరలపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాకు తదుపరి ప్రిన్స్‌కానున్న మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌తో అర్జెంటీనాలో సమాలోచనలు జరపనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రపంచంలోనే చమురు ఎగుమతులకు అతిపెద్ద దేశాలైన ఈ రెండు దేశాల నేతలూ 2019 ధరలపై చర్చించనున్నట్లు తెలుస్తొంది. 

Image result for crude oil production

సౌదీ షాక్‌...
ప్రపంచ ఇంధన మార్కెట్లో కీలకమైన ఒపెక్‌ దేశాలు ఇటీవల చమురు ఉత్పత్తిని పెంచడం ధరల పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సౌదీ అరేబియా అక్టోబర్‌లోనే రోజుకి 10.65 మిలియన్‌ బ్యారళ్లను ఉత్పత్తి చేయగా.. నవంబర్‌లో మరింత దూకుడు చూపింది. ఫలితంగా చమురు ఉత్పత్తి రికార్డ్‌ స్థాయిలో 10.9 మిలియన్‌ బ్యారళ్లను తాకింది. మొత్తం ఒపెక్‌ నుంచి రోజుకి 2.3 మిలియన్‌ బ్యారళ్లమేర అదనపు ఉత్పత్తి నమోదవుతున్నట్లు ప్రపంచ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) వెల్లడించింది. అయితే 2019లో ప్రపంచ డిమాండ్‌ 1.3 మిలియన్‌ బ్యారళ్లమేర మాత్రమే అదనంగా పెరిగే వీలున్నట్లు అంచనా. మరోపక్క అమెరికాలో చమురు నిల్వలు ఐదేళ్ల సగటును మించడంతో ధరలు క్షీణిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటికితోడు.. వాణిజ్య వివాదాల నేపథ్యంలో చైనాసహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనుందన్న అంచనాలు ముడిచమురు ధరలకు ఇటీవల షాక్‌నిస్తున్నాయి. 2008 తరువాత మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రానున్న ఏడాదికాలంలో క్షీణపథం పట్టనుందన్న అంచనాలు దీనికి కారణమవుతున్నాయి. బ్యాంక్‌ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ గత వారం నిర్వహించిన సర్వేలో పలువురు ఫండ్‌ మేనేజర్లు మందగమనంపట్ల బలమైన అంచనాలు ప్రకటించిన సంగతి తెలిసిందే!

Image result for Rupee vs dollar

ఇండియా.. భల్లేభల్లే
దేశీ ఇంధన అవసరాలలో 75 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడుతున్న కారణంగా ముడిచమురు ధరల పతనం ప్రభుత్వానికి లబ్ది చేకూర్చనుంది. ప్రధానంగా చమురు, పసిడి కొనుగోళ్ల కారణంగా వాణిజ్యలోటు పెరిగి దిగుమతుల బిల్లు భారమవుతున్న సంగతి తెలిసిందే. డాలర్లలో చెల్లింపుల కారణంగా రూపాయి సైతం బలహీనపడుతోంది. మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. వెరసి చమురు ధరలు క్షీణిస్తే.. రూపాయికి బలం చేకూరడంతోపాటు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపుకానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌కూ పరపతి నిర్ణయాలలో వెసులుబాటును కల్పించగలదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.Most Popular