ఈ కార్ల ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోబోతోంది.. !!

ఈ కార్ల ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోబోతోంది.. !!

భారత దేశంలో ఉత్పత్తవుతున్న కొన్ని కార్లు మనకు ఇక కనబడకుండా పోనున్నాయా?  ఎంతో కాలంగా కస్టమర్లను అలరిస్తున్న కొన్ని కార్ల మోడల్స్ ఇక ముందు కనబడవా? అవుననే అంటున్నారు.. కార్ల తయారీ దారులు. BS-VI ఉద్గార నిబంధనల ప్రకారం డీఆక్సైడ్, నత్రజని ఆక్సైడ్లు , డస్ట్ పార్టికల్స్‌ను తగ్గించడం కోసం కొన్ని కార్ల మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనున్నారు. రానున్న రెండేళ్ళలో సగం కంటే ఎక్కువగా ఈ కార్ల ఉత్పత్తులను ఆపివేస్తున్నట్టు వాహన రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. మన దేశంలో పర్యావరణ ప్రమాణాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగయ్యాయి. నిబంధనలు కూడా పూర్తిగా మార్చివేసింది ప్రభుత్వం.


పాత మోడళ్ళకు ఇక స్వస్తి...
దాంతో గతంలో తయారీ కాబడ్డ పాత వెహికిల్స్ ఇప్పటి ప్రమాణాలకనుగుణంగా లేకపోవడంతో ఆయా మోడల్స్‌ను నిలిపివేయనున్నారు. వీటిలో మారుతీ సుజుకీకి చెందిన ఓమిని, జిప్సీ వంటివి ఉన్నాయి. మారుతీ ఓమిని 1984 నుండి వాడకంలో ఉంది. అంతే కాకుండా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ గా పేరొందిన జిప్సీ కూడా సైనిక అవసరాలకు ఎంతగానో ఉపయోగ పడేది.  ఇవే కాకుండా మహీంద్రాకు చెందిన E20, ఫియట్ పుంటో, హుందాయ్ Eon, హోండా బ్రియో(Brio) , టాటా నానో (తొలి మోడల్ )  కూడా ఈ జాబితాలో ఉన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
టాటా నానో, E20 మోడల్స్‌ను  వచ్చే ఏడాది 2019 ఏప్రిల్ కల్లా నిలిపివేయనున్నారు. మారుతీ ఓమినీ, పుంటోలు కూడా తమ ఇంజిన్లను BS-VI కు మార్చకుంటే.. వాటిని కూడా ఏప్రిల్ 2020 కల్లా నిలిపివేయనున్నట్టు సమాచారం. ఆయా మోడల్స్ ఇంజిన్లను BS-VI ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకున్నట్టైతే.. వాటి మీద నిషేధాన్ని ఎత్తి వేసే అంశాన్ని పరిశీలిస్తామని పర్యావరణ శాఖ తెలియజేసింది.


ప్రతి వాహనంలోనూ ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి...
 నిస్సాన్ కు చెందిన టెర్రానో,  ఫియట్ లినియా, వోక్స్ వాగన్ అమో మోడల్స్ ఇప్పటికే  తమ ఇంజిన్ల మార్పిడికి కసరత్తులు మొదలు పెట్టాయి. ఒక వేళ వీటి ఇంజిన్లు పర్యావరణ నిబంధనలకు అనుకూలంగా లేకపోతే.. వీటిని కూడా బ్యాన్ చేయనున్నారు. భారతీయ కార్ల మార్కెట్ ప్రపంచ స్థాయి ఉద్గార, పర్యావరణ ప్రమాణాలతో వేగంగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు విధించిన కొత్త పర్యావరణ నిబంధనలు 2019 ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తాయి. అంతేకాకుండా ఇకపై కొత్త కార్ల ఉత్పత్తుల విషయంలో మెరుగైన ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ రక్షణలో భాగంగా ఏయిర్ బ్యాగ్స్, యాంటీ లాకింగ్ బ్రేక్ సిస్టమ్ తప్పని సరి చేశారు.


ప్రమాదాలు, కాలుష్యం మన దగ్గర ఎక్కువే...
మన దేశం ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచింది. 12 ప్రధాన నగరాల్లో 11 నగరాలు కాలుష్యంతో నిండిపోయాయి. రోడ్డు ప్రమాదాలు కూడా మనదేశంలో చాల ఎక్కువ. 2017లో మన దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,46,000 మంది చనిపోయారు. ఇక నుండి వీటిని అరికట్టే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆటో మోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) ప్రమాణాలను కొత్తగా విధించింది. వాహనాల్లో ట్రాకింగ్ డివైస్, ఎమర్జెన్సీ బటన్స్, లాంటివి తప్పనిసరిగా ఉండాల్సిందేనని తీర్మానించింది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని మారుతీ ఓమినిని నిలిపివేస్తున్నట్టు మారుతీ సుజుకీ(ఇండియా)  ఛైర్మన్ RC భార్గవ నిర్ధారించారు. టాటా మోటర్స్ ఈ విషయంలో స్పందిస్తూ.. త్వరలోనే కంపెనీ ద్వారా ప్రకటనను విడుదల చేస్తామని పేర్కొంది. అయితే ఫియట్ , వోక్స్ వాగన్, హుందాయ్ వంటి కంపెనీలు ఇప్పటికే తాము BS-VI ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలపగా, మహీంద్ర&మహీంద్రా మాత్రం తన E20 విషయంలో నోరు మెదపడం లేదు. కొన్ని మోడల్స్ ఇంజిన్లు మారుస్తామని, కానీ వేటిని నిలిపివేస్తామో ఇప్పుడే చెప్పలేమని మహీంద్ర కంపెనీ పేర్కొంది.
 

 Most Popular