యస్‌ బ్యాంక్‌కు మరో డైరెక్టర్- 'నో'!

యస్‌ బ్యాంక్‌కు మరో డైరెక్టర్- 'నో'!

ఇటీవల రాజీనామా పర్వాలతో షాక్‌తింటున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌కు మరోసారి దెబ్బతగిలింది. తాజాగా బ్యాంకు బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆర్‌.చంద్రశేఖర్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్యాంకులో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా బ్యాంకు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం పతనమై రూ. 198 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 192 దిగువకు జారింది. 

ఆగని రాజీనామాలు
గత వారం యస్‌ బ్యాంక్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి ఉన్నట్టుండి అశోక్‌ చావ్లా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తదుపరి కొత్త సీఈవో, ఎండీ అన్వేషణ కోసం ఏర్పాటైన సెర్చ్‌, సెలక్షన్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఓపీ భట్‌ సైతం పేర్కొన్నారు. గతంలో ఎస్‌బీఐ చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు ఏర్పాటైన యస్‌ బ్యాంక్‌ సెర్చ్‌ కమిటీకి బ్యాంకింగ్‌ నిపుణుడిగా సలహాలు అందించేందుకు తొలుత బాధ్యతలు స్వీకరించారు. ఈ బాటలో గత వారం వసంత్‌ గుజరాతీ సైతం ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్‌ను 2019 జనవరివరకే బాధ్యతలు నిర్వహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతించింది. దీంతో బ్యాంకు బోర్డు కొత్త సీఈవో ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించిన విషయం విదితమే.