సన్‌ ఫార్మా క్యూ2... ప్చ్‌!

సన్‌ ఫార్మా క్యూ2... ప్చ్‌!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఫలితాల అంచనాలతో నేటి ట్రేడింగ్‌లో సన్‌ ఫార్మా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 562 దిగువన ముగిసింది. కాగా.. మార్కెట్లు ముగిశాక కంపెనీ క్యూ2 ఫలితాలు విడుదల చేసింది. దీంతో బుధవారం సైతం ఈ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

నికరంగా నష్టం.. 
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో సన్‌ ఫార్మా రూ. 219 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇందుకు ఈ కాలంలో నమోదైన రూ. 1214 కోట్లమేర వన్‌టైమ్‌ నష్టం కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 6938 కోట్లను తాకగా.. నిర్వహణ లాభం(ఇబిటా) 11 శాతం పెరిగి రూ. 1531 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 20.7 శాతం నుంచి 22.1 శాతానికి బలపడ్డాయి. 

Image result for ashok leyland

అశోక్‌లేలాండ్ ఇలా
దేశీ ఆటో రంగ దిగ్గజం అశోక్‌ లేలాండ్ మార్కెట్లు ముగిశాక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రూ. 460 కోట్ల నికర లాభం ఆర్జించగా.. మొత్తం ఆదాయం రూ. 7608 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 806 కోట్లుకాగా... ఇబిటా మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో అశోక్‌ లేలాండ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.4 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. బుధవారం ట్రేడింగ్‌లో ఈ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలుంది. కాగా.. కంపెనీ ఎండీ, సీఈవో వినోద్‌ దాసరి మార్చి 2019 నుంచి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ధీరజ్‌ హిందుజా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.Most Popular