సంవత్ 2075 లాభసాటి పోర్ట్ ఫోలియో ఇదే...

సంవత్ 2075 లాభసాటి పోర్ట్ ఫోలియో ఇదే...

దీపావళి అనేది స్టాక్స్ కొనడానికి అనువైన సమయం . గత పదేళ్ళుగా ఇది నిరూపితమైంది కూడా. సాధారణంగా దివాలీ నుండి దివాలి వరకూ సెన్సెక్స్ లాభదాయక రిటర్న్స్ నే చూపిస్తూ ఉంది. గత పదేళ్ళుగా 8 సార్లు దివాలీ సీజన్ గుడ్ రిటర్న్స్ ను అందించింది.  కాబట్టి ఈ సాంప్రదాయక సెంటిమెంట్‌ను మీరెందుకు కొనసాగించకూడదు...! గత సెప్టెంబర్ మాసంలో స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగింది. అయినప్పటికీ  దివాలీ సీజన్ మంచి స్టాక్స్ ఎంపికకు అనువైన సమయమనే స్టాక్ విశ్లేషకులు భావించారు. గత దివాలీ నుండి ఈ దివాలీ వరకూ జరిగిన సంవత్ 2074 లో దాదాపు 8 శాతం రిటర్న్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నడుస్తున్న సంవత్ 2075 మాత్రం ఇందుకు విభిన్నంగా ఉండబోతుందని ప్రముఖ స్టాక్ ఎనలిస్ట్ సునీల్ దమానియా అంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల, రూపీ కాస్త కోలుకోడం, FPI లనుండి పెట్టుబడుల ప్రవాహం ఇవ్వన్నీ రానున్న సంవత్సరం ఫలితాలను మరింత మెరుగు పరచనున్నాయని సునీల్ భావిస్తున్నారు. మరో వైపు రానున్న సంవత్సరంలో దేశంలో జరగనున్న సాధారణ ఎన్నికలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఇప్పుడే మంచి స్టాక్స్ ను ఎంపిక చేసుకుని, మీ పోర్ట్ ఫోలియోలను పునర్‌నిర్మించుకోమని దమానియా సలహా ఇస్తున్నారు.మొత్తం మీద ఈ సంవత్ 2075 మదుపర్లకు సానుకూల, లాభదాయక సంవత్సరంగా మారనుందని ఎక్కువ శాతం విశ్లేషకులు భావిస్తున్నారు.  గత సంవత్‌ 2074 లో 8శాతం లాభాలు నమోదు కాగా, ఈ సంవత్ 2075 లో అవి ద్విసంఖ్యా శాతానికి (డబుల్ డిజిట్ )  చేరొచ్చని అంచనా. అంతే కాకుండా సెన్సెక్స్ 40,000 పాయింట్ల టార్గెట్‌ కు చేరుకోవచ్చని ప్రముఖ మార్కెట్  విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక ఇన్వెస్టర్‌ వద్ద 10 లక్షలు ఉన్నాయనుకోండి. వాటిని స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలో ఎనలిస్టులు ఆ పోర్ట్ ఫోలియోను ఇలా ఉదహరిస్తున్నారు. బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, నోసిల్, ఓరియంట్ సిమెంట్ , తమిళనాడు పెట్రో లాంటి వాటిల్లో 98శాతం పెట్టుబడులు, క్యాష్ రూపంలో 2శాతం నగదును ఉంచుకునేలా వారు పోర్ట్ ఫోలియోను నిర్మించారు.

పైనున్న పోర్ట్ ఫోలియోను పరిశీలిస్తే.. అందులోని కంపెనీలు పూర్తిగా విభిన్నమైనవి. ఒక దానికొకటి సంబంధం లేనటువంటివే. ఇదే ఇక్కడ పనిచేస్తుంది. ఒక మంచి స్ట్రాటజీ ఉన్న మదుపరి తన స్టాక్స్ ను సారూప్యం ఉన్న వాటిలో కాకుండా విభిన్న రంగాల్లోనే పెట్టుబడులు పెట్టాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాల్లో రానున్న రోజుల్లో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాయనే నమ్మకం ప్రగాఢంగా ఉన్న కంపెనీలనే వారు సెలెక్ట్ చేశారు. పై గ్రాఫ్‌ను సరిగ్గా పరిశీలిస్తే... వాల్యూయేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న కంపెనీలను వారు విస్మరించారు. అంతే కాకుండా.. రెగ్యులర్‌గా ఈ స్టాక్స్ పెరుగుతాయని భావించే స్టాక్స్ ను కూడా ఎనలిస్టులు పట్టించుకోలేదు. సంవత్సర కాలం పాటు నిలకడగా వృద్ధి రేటును సాధించే కంపెనీలనే పై పోర్ట్ ఫోలియోలో చూపించారు. హై లీవరేజ్ కంపెనీలను కాకుండా.. మేనేజ్‌మెంట్‌లో క్వాలిటీ ఉన్న కంపెనీలనే ఎనలిస్టులు సూచిస్తున్నారు. సిద్దాంత పర ఇన్వెస్టర్లు కూడా వీటినే ఎంచుకోవడం ఇక్కడ గమనార్హం.  పై పోర్ట్ ఫోలియో  ప్రకారం స్టాక్స్ ను ఎంచుకున్న ప్రముఖ బ్రోకింగ్ ఇన్వెస్టర్ దమానియా వీటితో వచ్చే దివాలీ కల్లా 20శాతం ప్రాఫిట్స్ ను ఆర్జిస్తామని భావిస్తున్నారు.  పై పోర్ట్ ఫోలియోలోని కంపెనీల చరిత్రను ఒక సారి పరిశీలిద్దాం.


బజాజ్ ఆటో  CMP: Rs.2,668
త్రైమాసిక ఫలితాల ట్రెండ్సానుకూలం
కంపెనీ నాణ్యత :              ఎక్సలెంట్
వ్యాల్యూషన్   :               ఆకర్షణీయం
ఇండస్ట్రీ ఎవరేజ్‌ కన్నా బజాజ్ ఆటో వాహనాల విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. కాక పోతే గత సెప్టెంబర్ లో మార్కెట్ అంచనాలకంటే తక్కువగా లాభాలను నమోదు చేసింది. గత రెండు సంవత్సరాలుగా స్టాక్స్ పెద్దగా లాభాలనూ తెచ్చిపెట్టలేదు. గత మూడేళ్ళుగా వార్ఫిక వృద్ధి రేటు 3.5శాతం గా ఉంది. గత 5 ఏళ్ళలో ఇది 5శాతంగానే ఉంది. అయితే గత మూడేళ్ళుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మందకోడిగా ఉండటం, వర్షాభావం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కానీ.. రానున్న సంవత్సరంలో ఇవి పుంజుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నోట్ల రద్దు, GST వంటి ఉత్పాతాలు కాస్త సద్దుమణిగాయి కాబట్టి రానున్న రోజుల్లో మోటార్ వాహానాల రంగం రికవరీ కావొచ్చని అంచనా.
అంతే కాకుండా డొమెస్టిక్ మోటార్ సైకిళ్ళ వ్యాపారం దేశంలో విస్తరిస్తుంది. ఇది కూడా కంపెనీకి లాభసాటిగా మారే అవకాశం ఉంది. ప్రాథమిక మోడళ్ళు, స్పోర్ట్స్ , సూపర్ బైక్స్ రంగంలో బజాజ్ కొత్త మోడళ్ళతో ముందుకు దూసుకెళ్తుంది. మార్కెట్‌లో బజాజ్ షేర్‌ను పెంచినవి ఆ కంపెనీ ప్రాథమిక మోడళ్ళే. అక్టోబర్ 2018 నాటికి బజాజ్ అమ్మకాల్లో 28 శాతం పెరుగుదల కనిపించింది. కంపెనీ వాల్యూమ్ గ్రోత్ కూడా 41 శాతం పెరిగింది. ఇది ఇంకా పెరిగేదే.. కానీ.. పండుగ సీజన్లలో డిస్కౌంట్లు, రేట్ల తగ్గింపు వల్ల  ఇంకాస్త పెరుగుదల సాధ్యం కాలేదు. ఈ అక్టోబర్ లో బజాజ్ తన వాహన శ్రేణుల మీద ధరలు కూడా కాస్త పెంచడంతో లాభాల బాట పట్టడానికి దోహద పడింది. అంతే కాకుండా 2018 సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ వాల్యూయేషన్ మనీ, నగదు నిల్వలు రు. 16,000 కోట్లకు చేరడం కూడ కంపెనీ స్టాక్స్ పై అంచనాలు పెంచాయి. రెవిన్యూ గ్రోత్ 24 శాతం పెరిగి, రు. 15,406 కోట్లుగా ఉందని ఓ ప్రకటనలో తెలిపింది.  రానున్న కాలంలో ఈ కంపెనీ షేర్ దాదాపు 24 శాతం పెరిగే అంచనాలున్నాయని స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు.   వచ్చే దీపావళికి బజాజ్ ఆటో షేర్ టార్గెట్ ప్రైస్‌గా రు. 3300 గా ఎనలిస్టులు పేర్కొంటున్నారు.


ఎస్కార్ట్స్ CMP: రు. 673
త్రైమాసిక ఆర్ధిక ఫలితాలుసానుకూలం
కంపెనీ క్వాలిటీ       :         గుడ్
వాల్యూయేషన్       :        ఆకర్షణీయం
తాజాగా మార్కెట్ కరెక్షన్లకు గురైనా ఎస్కార్ట్స్ కంపెనీ షేర్ నిలకడైన వృద్ధిని సాధించింది. కొత్త ఉత్పత్తులతో, అదనపు ఉత్పాదక సామర్ధ్యంతో కంపెనీ పట్ల అంచనాలను పెంచాయి. దీర్ఘకాలిక రుణాలు లేక పోవడం, నగదు నిల్వలు సమృద్ధిగా ఉండటం ఎస్కార్ట్స్ కంపెనీకి కలిసొచ్చే అంశం.
తాజాగా మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగంలో పెను దుమారం వల్ల ఎస్కార్ట్స్ కంపెనీ షేర్ కూడా కొద్దిగా చలిచింది. అయితే ఈ సెప్టెంబర్ రెండో త్రైమాసిక ఫలితాల్లో అత్యుత్తమ లాభాల ఆర్జన ద్వారా స్థిరత్వం ఉందని నిరూపించుకుంది. ఈ ఆర్ధిక సంవత్సర తొలి అర్ధభాగానికల్లా తన లాభాలను రు. 223 కోట్లకు పెంచుకోగలిగింది. గత సంవత్సరంలో ఇది రు. 140 కోట్లుగా మాత్రమే ఉంది. 2018 సెప్టెంబర్ చివరికి కంపెనీ నెట్ ప్రాఫిట్ రు. 345 కోట్లుగా చూపించింది.  ఎస్కార్స్ట్ కంపెనీకి ప్రధాన ఆదాయ వనరులైన వ్యవసాయ ఉత్పత్తి పరికరాలు, నిర్మాణ పరికరాలు, రైల్వే ఉపకరణాల వంటి వాటిలో ప్రోడక్ట్స్ ను పెంచింది.  నిర్మాణ రంగంలో ఇప్పటికే కంపెనీకి పలు ఆర్డర్లు ఉండటంతో బాటు, తాజాగా జపాన్ కంపెనీ టాడనో మాన్యుఫ్యాక్ట్చర్స్ తో జాయింట్ వెంచర్  చేయడంతో ఎస్కార్ట్స్ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. టెరియన్ క్రేన్స్ , ట్రక్ మౌంటెడ్ క్రేన్స్ నిర్మాణంలో ఈ సంయుక్త భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని ఎస్కార్స్ట్ తెలిపింది. ఇక దేశీయంగా నార్త్ సైడ్ , సెంట్రల్ మార్కెట్లలో తన ప్రధాన ఉత్పత్తి అయిన ట్రాక్టర్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. దాదాపు 10 శాతం మార్కెట్ వాటాను ఎస్కార్ట్ దక్కించుకుంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ కంపెనీలో 28శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కూడా ఎస్కార్ట్స్ లో 8.16 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు. రూరల్ డెవలప్‌మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా ఎస్కార్ట్స్ కు కలిసొచ్చే అంశమే. ఈ అంశాల వల్లే స్టాక్ ఎనలిస్టులు  ఈ కంపెనీ షేర్ వాల్యూ వచ్చే దీపావళి కల్లా నాలుగు అంకెల్లోకి మారనుందని అంచనా వేస్తున్నారు.


నోసిల్ (Nocil ) CMP: రు. 163
త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు:      సానుకూలం
కంపెనీ నాణ్యత            :       గుడ్
వాల్యూయేషన్            :       ఆకర్షణీయం
నోసిల్ కంపెనీకున్న ప్రధాన బలం ... ఆ కంపెనీకి రుణాలు అంటూ లేక పోవడమే. రుణ రహిత కంపెనీగా నోసిల్ దిన దినాభివృద్ధి చెందుతుంది. ప్రముఖ మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ప్రతి క్వార్టర్‌కు ఈ కంపెనీ స్టాక్స్ ను తమ పోర్ట్ ఫోలియోలో పెంచుతూ పోతారు. కంపెనీ క్యాపెక్స్ రు. 425 కోట్లుగా ఉంది. అందువల్లే నిలకడగా ప్రతి సంవత్సరం డివిడెండ్ చెల్లించగలుగుతుంది. మంచి ఇన్ట్సిట్యూషనల్ ఇన్వెస్టర్ల సాంగత్యం కూడా కంపెనీకి కలిసొచ్చిన పరిణామం. ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్లైన ఆశిష్ కచోలియా, డాలీ ఖన్నా వంటి వారు ఈ కంపెనీలో వరుసగా 4.16శాతం, 1.98శాతం పెట్టుబడులు పెట్టారు. హృషికేష్‌ మఫత్‌లాల్ గ్రూప్ కు చెందిన ఈ నోసిల్‌కు మార్కెట్లో మంచి పేరు ఉంది. దేశంలోని రబ్బర్ కెమికల్స్ తయారీ మార్కట్లో నోసిల్‌కు దాదాపు 40శాతం వాటా ఉంది.  టైర్ల తయారీకి సంబంధించిన రబ్బర్‌ కెమికల్ ను ప్రముఖ టైర్ల కంపెనీలకు నోసిల్ సరఫరా చేస్తుంది. వీటికున్న డిమాండ్ అధికం కాబట్టి కంపెనీ గ్రోత్ రేట్ దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ (OPM) 2014లో పది శాతం ఉండగా , ఈ ఆర్ధిక సంవత్సరం 2018లో అది 27శాతానికి ఎగిసింది. ఈ ఆర్ధిక సంవత్సర తొలి అర్ధ భాగానికల్లా OPM 29శాతానికి పెరిగింది. వచ్చే దివాలీ కల్లా నోసిల్ స్టాక్స్ టార్గెట్ ధర రు. 225 గా ఉండొచ్చని ఎనలిస్టులు పేర్కొన్నారు.


ఓరియంట్ సిమెంట్ CMP : రు. 87.5
త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు :  ప్రతికూలం
కంపెనీ నాణ్యత          :     మధ్యమం
వాల్యూయేషన్         :     ఫెయిర్
గత సంవత్సరం ఓరియంట్ సిమెంట్స్ షేర్ దాదాపు 50శాతం పతనమైంది. అయినప్పటికీ.. రానున్న సంవత్సరంలో సిమెంట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగనుండటం,  కంపెనీ సిమెంట్ టన్నుకు ఆకర్షణీయమైన EV(ఎర్నింగ్ వాల్యూ) లు కలిగి ఉండటం.. ఓరియంట్ సిమెంట్‌ను ఆకర్షణీయంగా మార్చింది. సాధారణంగా సిమెంట్ కంపెనీల వాల్యూను  EV పర్ టన్ చొప్పున కొలుస్తారు. అంతే కాకుండా పలువురు ఇన్ట్సిట్యూషన్ ఇన్వెస్టర్లు కూడా ఇదే కంపెనీలో 43 శాతం స్టాక్స్ ను కలిగి ఉన్నారంటే , ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు ఎంత ఫ్యాన్సీ ఐటెంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. 2022 సంవత్సరం కల్లా కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యం 15 మిలియన్ టన్నులుగా పెంచనున్నట్టు ఓరియెంట్ సిమెంట్స్ ప్రకటించడం కూడా కంపెనీ స్టాక్స్ పై అంచనాలను పెంచాయి.
ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యం 8 మిలయన్ టన్నులుగా ఉంది. తెలంగాణలోని దేవ్‌పూర్ , కర్ణాటకలోని చిత్తాపూర్, మహరాష్ట్రలోని జాల్‌గావ్ ల్లో ఉన్న తన ఉత్పత్తి కర్మాగారాల నుండి ఈ 8 మిలియన్ టన్నుల సిమెంట్‌ను సాలీనా ఉత్తత్తి చేస్తుంది ఓరియంట్ సిమెంట్. కంపెనీ మార్కెట్ క్యాప్ రు. 1750 కోట్లుగా ఉంది. CK బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ ఓరియంట్ సిమెంట్ రెండు బ్రాండ్ల అమ్మకాలు జరుపుతుంది. బిర్లా A-1,  స్ట్రాంగ్ క్రీట్  అన్న బ్రాండ్ల అమ్మకాలు కంపెనీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. రానున్న రోజుల్లో నిర్మాణ రంగం ఊపందుకోడం, పలు ప్రాజెక్టులు పట్టాలకెక్కనుండటంతో సిమెంట్ రంగంలో నిలకడైన వృద్ధి కనబడటం ఖాయం. అందుకే ఓరియంట్ సిమెంట్ షేర్లు వచ్చే దీపావళి కల్లా 35-40 శాతం పెరగొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.


తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ . CMP: రు. 38
త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు :      పూర్తి సానుకూలం
కంపెనీ నాణ్యత             :       మధ్యమం
వాల్యూయేషన్        :             ఫెయిర్
సెప్టెంబర్ క్వార్టర్‌లో తమిళనాడు పెట్రో ఉత్తమ ఫలితాలను కనబరిచింది. కంపెనీ పర్ ఎర్నింగ్స్ కూడా 7 రెట్లు పెరిగాయి.  ఉత్తమ ఆర్ధిక గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు పెట్రో పై అంచనాలు పెరిగేలా చేశాయి. కంపెనీ ఉత్పత్తి అయిన ప్రోపలేన్ ఆక్సైడ్‌ కు  రానున్న ఆర్ధిక సంవత్సరంలో డిమాండ్ పెరగడం కూడా కంపెనీకి కలిసొచ్చే అంశమే. కంపెనీ ప్రైస్‌ టు బుక్ వాల్యూ కూడా పెరగడంతో కంపెనీ స్టాక్స్ కు డిమాండ్ ఉంది. తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ.. లైనర్ ఆల్కైల్ బెంజీన్ (LAB) తయారీలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. కంపెనీ ఆదాయంలో 86శాతం LAB అమ్మకాల మీదే రావడం గమనార్హం. ఈ LABను ఎక్కువగా కేబుల్ ఆయిల్, పెయింట్స్, ఇంక్ కంపెనీల వారు ఉపయోగిస్తారు. ప్రముఖ FMCG కంపెనీలు అయిన యూనిలివర్, P&G  వంటి కంపెనీలు తమిళనాడు పెట్రో ప్రోడక్ట్స్ కు కస్టమర్లుగా ఉన్నారు. తమిళనాడు పెట్రో కంపెనీ తన ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకునే ప్రణాళికలు వేయడం, రానున్న రోజుల్లో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరగనుండటంతో  ఈ కంపెనీ స్టాక్స్ ఎనలిస్టులకు హాట్ ఫేవరెట్ గా మారింది.

Disclaimer: పైన ఉదహరించిన సూచనలు ప్రముఖ స్టాక్ ఎనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. స్టాక్స్ పిక్ చేసుకునే ముందు మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.

 Most Popular