ఫ్లాట్‌ ఓపెనింగ్‌ చాన్స్‌!?

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ చాన్స్‌!?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 10,665 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. మంగళవారం మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనూ అమెరికా స్టాక్‌ మార్కెట్లు 0.65 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఇక ఆసియాలో మిశ్రమ ధోరణి నెలకొంది. చైనా, కొరియా, జపాన్‌ 0.7-0.3 శాతం మధ్య నష్టపోగా.. తైవాన్‌, థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.85-0.3 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌, హాంకాంగ్‌ 0.15 శాతం స్థాయిలో లాభపడ్డాయి. 

హుషారుగా మొదలై
మంగళవారం ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దీపావళి పండుగ జోష్‌ నేపథ్యంలో తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 34,992 వద్ద నిలిచింది. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ సాధించి 35,196 వరకూ ఎగసింది. తద్వారా మరోసారి 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కాగా.. నిఫ్టీ సైతం 10600-10491 మధ్య ఊగిసలాడింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,530 వద్ద స్థిరపడింది.

యూఎస్‌ మార్కెట్లు ప్లస్‌లో
మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 173పాయింట్లు(0.7 శాతం) పెరిగి 25,635 వద్ద నిలవగా... ఎస్‌అండ్‌పీ 17 పాయింట్ల(0.65 శాతం) బలపడి 2,755 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 47 పాయింట్లు(0.65 శాతం) పుంజుకుని 7,376 వద్ద ముగిసింది. హెల్త్‌కేర్‌ స్టాక్స్‌లో సీవీఎస్‌ హెల్త్‌కార్ప్‌ 6 శాతం, మైలాన్‌ ఎన్‌వీ 16 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఫెర్టిలైజర్‌ కంపెనీ మొజాయిక్‌ సైతం 11 శాతం దూసుకెళ్లగా.. బిల్డింగ్‌ మెటీరియల్స్‌ సంస్థ మార్టిన్‌ మరియట్టా 8 శాతం జంప్‌చేసింది. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 119 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు పూర్తిగా సైలెంట్‌ అయిపోగా.. డీఐఐలు మాత్రం రూ. 622 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. 

 Most Popular