తొలుత లాభాల డబుల్‌- చివరికి ఫ్లాట్‌!

తొలుత లాభాల డబుల్‌- చివరికి ఫ్లాట్‌!

ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దీపావళి పండుగ జోష్‌ మిడ్‌సెషన్‌ నుంచీ చల్లారింది. దీంతో తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ఎక్కడివక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 34,992 వద్ద నిలిచింది. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ సాధించి 35,196 వరకూ ఎగసింది. తద్వారా మరోసారి 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కాగా.. నిఫ్టీ సైతం 10600-10491 మధ్య ఊగిసలాడింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,530 వద్ద స్థిరపడింది.

Image result for PSU Banks

ప్రభుత్వ బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2.25 శాతం క్షీణించగా.. ఎఫ్‌ఎంసీజీ 0.8 శాతం నీరసించింది. ఐటీ 0.7 శాతం, రియల్టీ 0.4 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, యస్‌బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంతా, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌ 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే సిప్లా దాదాపు 6 శాతం పతనంకాగా.. ఎస్‌బీఐ, హెచ్‌పీసీఎల్‌, యాక్సిస్, బీపీసీఎల్‌, ఐవోసీ, టైటన్‌, మారుతీ, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు డీలా
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.6 శాతం నీరసించింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1270 నష్టపోగా... 1285 లాభాలతో నిలిచాయి. 

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పూర్తిగా సైలెంట్‌ అయిపోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మాత్రం రూ. 622 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.Most Popular