గల్ఫ్‌ ఆయిల్‌, గ్రాఫైట్‌ ఇండియా అప్‌

గల్ఫ్‌ ఆయిల్‌, గ్రాఫైట్‌ ఇండియా అప్‌

ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో లూబ్రికెంట్స్‌ సంస్థ గల్ఫ్‌ ఆయిల్‌ ఇండియా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో గ్రాఫైట్‌ ఇండియా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. వివరాలు చూద్దాం...

గల్ఫ్‌ ఆయిల్‌ ఇండియా
దేశీయంగా తయారు చేసి విక్రయించే ప్యాసింజర్‌ వాహనాలకు వినియోగించేందుకు వీలుగా టాటా మోటార్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ తాజాగా పేర్కొంది. తద్వారా కోబ్రాండెడ్‌ లూబ్రికెంట్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా ఇంజిన్‌ ఆయిల్‌, గేర్‌ ఆయిల్‌, బ్రేక్‌ ఆయిల్‌ తదితరాలను విడుదల చేయనున్నట్లు వివరించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.6 శాతం దూసుకెళ్లి రూ. 780 వద్ద ట్రేడవుతోంది. గల్ఫ్‌ ఆయిల్‌లో ప్రమోటర్లకు 72.74 శాతం వాటా ఉంది. 

Image result for graphite india

గ్రాఫైట్‌ ఇండియా

ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో గ్రాఫైట్‌ ఇండియా నికర లాభం 10 రెట్లు దూసుకెళ్లి రూ. 1,113 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం 343 శాతం ఎగసింది. రూ. 2345 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ బాటలో నిర్వహణ లాభం(ఇబిటా) 11 రెట్లు పుంజుకుని రూ. 1640 కోట్లకు చేరగా.. వాటాదారులకు షేరుకి రూ. 20 డివిడెండ్‌ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ఎన్‌ఎస్ఈలో తొలుత ఈ షేరు 1000 వరకూ ఎగసింది. ప్రస్తుతం 0.4 శాతం బలపడి రూ. 973 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 952 దిగువన కనిష్టాన్నీ తాకింది.Most Popular