ఆటో యాక్సిల్స్‌ అప్‌- శివమ్‌ ఆటో డౌన్‌

ఆటో యాక్సిల్స్‌ అప్‌- శివమ్‌ ఆటో డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతోంది. మరోపక్క ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ఆటో విడిభాగాల సంస్థ శివమ్‌ ఆటోటెక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఆటోమోటివ్‌ యాక్సిల్స్‌ నికర లాభం 57 శాతం జంప్‌చేసి రూ. 32 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం 43 శాతం ఎగసింది. రూ. 498 కోట్లయ్యింది. ఈ బాటలో నిర్వహణ లాభం(ఇబిటా) 50 శాతం పుంజుకుని రూ. 59 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 11.2 శాతం నుంచి 11.8 శాతానికి బలపడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 1246 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1274 వద్ద గరిష్టాన్నీ, రూ. 1180 వద్ద కనిష్టాన్నీ తాకింది.

Image result for shivam auto rohtak

శివమ్‌ ఆటోటెక్‌ 
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో శివమ్‌ ఆటోటెక్‌ నికర లాభం 79 శాతం పడిపోయి రూ. 1.2 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం పుంజుకుని రూ. 162 కోట్లను తాకింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో శివమ్‌ ఆటోటెక్‌ షేరు దాదాపు 6 శాతం పతనమై రూ. 47 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 49 వద్ద గరిష్టాన్నీ, రూ. 47 దిగువన కనిష్టాన్నీ తాకింది. విభిన్న గేర్లు స్ల్పైన్‌ షాఫ్ట్స్‌ తయారు చేసే ఈ సంస్థలో ప్రమోటర్లకు దాదాపు 75 శాతం వాటా ఉంది.Most Popular