పెరిగిన ధన్ తేరాస్ పసిడి అమ్మకాలు

పెరిగిన ధన్ తేరాస్ పసిడి అమ్మకాలు

గత దసరాకు కాస్త నిరాశ పరిచిన గోల్డ్ ఆభరణాల అమ్మకాలు ఈ దీపావళికి మాత్రం పుంజుకున్నాయి. ధన్‌ తేరాస్‌ నాడు కొంతైనా బంగారం కొనాలనుకోడం, లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించే దివాలీకి బంగారం కోనుగోలు చేసే సాంప్రదాయం దేశంలో ఉండటంతో ఈ దివాలీకి బంగారు ఆభరణాల విక్రయాలు పెరిగాయి. అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు తగ్గినా.. రూపీ మారకపు విలువ పడిపోడంతో ఇక్కడ బంగారం ధర పెరిగింది. ఈ సోమవారం నాటికి దేశంలో బంగారం ధర 7.2శాతం పెరిగి 10 గ్రాముల బంగారం రు. 31,760 కు చేరింది. గత సంవత్సరం కంటే ఇది ఎక్కువే అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్ ఆయిల్ అనిశ్చితి, రూపీ పతనం వంటి కారణాలతో గోల్డ్ కొనుగోళ్ళు నెమ్మదించాయి. కానీ పండుగ సెంటిమెంట్ రిటైల్ గోల్డ్ విక్రయదారులను కాపాడిందనే చెప్పొచ్చు. కోనుగోళ్లు దసరాకు మందగించడంతో బంగారు ఆభరణాల తయారీ దారులు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటించారు. తయారీ, తరుగు మీద దాదాపు 50 శాతం వరకూ రాయితీలను ప్రకటించారు. ఇది కూడా బంగారు ఆభరణాల కోనుగోళ్లు పెరగడానికి దోహద పడింది. ఈ ధన్ తేరాస్ నాటికి బంగారం కోనుగోళ్లు 7-10 శాతం పెరిగాయి.  పండగ సెంటిమెంట్ కొనుగోలు దారులను పెంచిందని అఖిల భారత గోల్డ్ & జెమ్స్ డొమెస్టిక్ కౌన్సిల్ అధ్యక్షుడు నితిన్ ఖండేల్ వాల్ అంటున్నారు. ఈ సోమవారం ధన్ తేరాస్ రోజు సేల్స్ చివరి ఘడియల్లో దాదాపు 20 శాతం అమ్మకాలు పెరిగాయని పాప్‌లే &సన్స్  డైరెక్టర్ రాజీవ్ పాప్‌లే విశ్లేషించారు.  ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరగడంతో వినియోగ దారులు కొనుగోళ్ళపై ఆసక్తి చూపలేదు. కానీ పండుగ సెంటిమెంట్ వల్లే దేశంలో కోనుగోళ్ళు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ P.R. సోమసుందరం అంటున్నారు. డిజిటల్ కొనుగోళ్ళు అందుబాటులో ఉన్నా వినియోగ దారులు నేరుగా షాపుల్లోనే కొనుగోళ్లు చేయడానికి ఇష్టపడతారని సోమసుందరం పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న బంగారు ఆభరణాల దుకాణాలు మాత్రం ఈ దీపావళికి కళకళ లాడుతున్నాయి. డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్లు కూడా దేశీయంగా స్వల్పంగా పెరిగాయి.


పండుగే కాదు , పెట్టుబడులుగా గోల్డ్ కొనుగోళ్లు
స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం, గత కొద్ది నెలలుగా చూస్తున్న కరెక్షన్ వల్ల మదుపర్లు కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. అందుకే బంగారం కొనుగోళ్ళు పెరుగుతున్నాయని PNG జ్యుయల్‌రీస్ ఛైర్మన్ సౌరభ్ గాడ్గిల్ అంటున్నారు. అంతే కాకుండా ఈ ధన్ తేరాస్ సందర్భంగా వజ్రాభరణాల విక్రయాలు కూడా పెరిగాయని సౌరభ్  పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు 20-25 శాతం వజ్రాభరణాల కొనుగోళ్లు పెరిగాయని సౌరభ్ తెలిపారు. బంగారం మీద పెట్టుబడులు సురక్షితమని భావించే భారతీయ సాంప్రదాయిక సెంటిమెంట్ వల్లే ప్రస్తుత కొనుగోళ్లలో ఊపు తెచ్చిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆభరణాల రూపంలోనే కాకుండా గోల్డ్ డాలర్స్, డిజిటల్ గోల్డ్, బాండ్స్ రూపంలో కూడా ఈ సంవత్సరం కొనుగోళ్లు పెరిగాయని బులియన్ డీలర్ కుమార్ జైన్ అంటున్నారు. డాలర్ తో రూపీ మారకపు విలువ పతనం, గ్లోబల్ మార్కెట్ల అనిశ్చితి, అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, దేశీయ మార్కెట్ల సంక్షోభం ఇవ్వన్నీ ఉన్నా గోల్డ్ మాత్రం నిలకడగా తన ప్రభావాన్ని చూపుతూనే ఉందని మదుపర్లు భావిస్తున్నారు. అందుకే ఇది సురక్షితమనే భావనలో వారున్నారని మోతీలాల్ ఓశ్వాల్ ఫిన్ సర్వీసెస్ విశ్లేషకులు  నవనీత్ దమానీ అన్నారు. ఈ సంవత్సర కాలంలో రూపీ 14శాతం నష్టపోవడంతో  బంగారం రేటు దేశీయంగా పెరిగింది. ఈ దివాలీ సంవత్‌లో కూడా బంగారం డిమాండ్ తరగదని  మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.   
 Most Popular