యూఎస్‌ మార్కెట్లకు బ్లూచిప్స్‌ దన్ను

యూఎస్‌ మార్కెట్లకు బ్లూచిప్స్‌ దన్ను

ప్రధానంగా ఫైనాన్షియల్స్‌, ఎనర్జీ, డిఫెన్సివ్‌ రంగాలు బలపడటంతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 191 పాయింట్లు(0.8 శాతం) పెరిగి 25,462 వద్ద నిలవగా... ఎస్‌అండ్‌పీ 15 పాయింట్ల(0.6 శాతం) బలపడి 2,738 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 28 పాయింట్లు(0.4 శాతం) పుంజుకుని 7,434 వద్ద ముగిసింది. 

మధ్యంతర ఎన్నికలపై దృష్టి
అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఓపీనియన్‌ పోల్స్‌ ప్రకారం ప్రెసిడెంట్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనేట్‌ మద్దతు కూడగట్టుకున్నప్పటికీ.. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో నియంత్రణను డెమక్రాట్లకు జారవిడుచుకునే వీలుంది. ఫలితంగా ట్రంప్‌ చేపట్టిన ప్రోబిజినెస్‌ అజెండాకు స్పీడ్‌ బ్రేకర్లు అడ్డుతగలనున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నిక నేపథ్యంలో 2016 మొదలు అమెరికా మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

Image result for berkshire hathaway

రంగాలవారీగా
రియల్టీ, యుటిలిటీస్‌, కన్జూమర్‌ స్టేపుల్స్‌, ఎనర్జీ రంగాలు 1.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. త్రైమాసిక లాభాలు రెట్టింపు కావడంతో బఫెట్ దిగ్గజ సంస్థ బెర్కషైర్‌ హాథవే 5 శాతం జంప్‌చేసింది. అయితే హాలిడే అమ్మకాలు అంచనాలను చేరకపోవచ్చంటూ నిరుత్సాహకర గైడెన్స్‌ ప్రకటించిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ షేరు మరోసారి 3 శాతం తిరోగమించింది. వెరసి 2013 జనవరి తరువాత వరుసగా రెండు రోజుల్లో యాపిల్‌ షేరు దాదాపు 10 శాతం పతనమైంది. శుక్రవారం సైతం ఈ కౌంటర్‌ 7 శాతం వెనకడుగువేసిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ దిగువకు చేరింది.

ఆసియా అటూఇటుగా
సోమవారం యూఎస్‌ మార్కెట్లు లాభపడినప్పటికీ ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. చైనా, తైవాన్‌ దాదాపు 1 శాతం చొప్పున క్షీణించగా..  హాంకాంగ్‌ 0.3 శాతం నీరసించింది. అయితే జపాన్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 1-0.5 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌ సెలవులో కొనసాగుతుంటే.. కొరియా నామమాత్ర నష్టంతో కదులుతోంది.Most Popular