ఇక మార్కెట్‌ కళ్లన్నీ ఫెడ్‌పైనే!?

ఇక మార్కెట్‌ కళ్లన్నీ ఫెడ్‌పైనే!?

ఈ వారం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌పై దృష్టిసారించనున్నారు. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) రెండు రోజుల పరపతి సమీక్షా సమావేశాలు 7న(బుధవారం) ప్రారంభంకానున్నాయి. గురువారం వెలువడనున్న ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఫెడ్‌ అనుసరిస్తున్న వడ్డీ రేట్ల పెంపు విధానాలపట్ల బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ఆర్థిక వృద్ధి, ఉపాధి మార్కెట్‌ రక్షణ, ద్రవ్యోల్బణ కట్టడి తదితర అంశాల నేపథ్యంలో క్రమానుగత రేట్ల పెంపు విధానాలకే గత సమీక్షలో చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అధ్యక్షతన ఎఫ్‌వోఎంసీ మొగ్గు చూపింది. దీంతో ఫెడ్‌ సమావేశాలకు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఫెడ్‌ కట్టుబడవచ్చని.. డిసెంబర్‌ సమావేశంలో పావు శాతం వడ్డీ రేటు పెంపు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 2-2.5 శాతంగా అమలవుతున్నాయి. 

Image result for stock brokers celebrating

దివాలీ ట్రేడింగ్‌
బుధవారం(7న) దీపావళి పండుగ సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్‌కు బదులుగా ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నారు. అంటే ఆ రోజు ఉదయం ట్రేడింగ్‌ ఉండబోదు. సాయంత్రం 5.30-6.30 మధ్య బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. బలిప్రతిపాద సందర్భంగా గురువారం(8న) బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. తిరిగి శుక్రవారం యథావిధిగా ఉదయం 9.15కు సాధారణ ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.

క్యూ2 ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న కంపెనీల జాబితాలో ఆయిల్‌ రంగ పీఎస్‌యూ ఓఎన్‌జీసీ, బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌, బాష్‌, సిప్లా, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌ ఉన్నాయి. ఇవన్నీ క్యూ2(జులై-సెప్టెంబర్‌) ఫలితాలను 5న(సోమవారం)  వెల్లడించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఇదే రోజు యూరోజోన్‌ ఆర్థిక మంత్రుల సదస్సు జరగనుంది. సమీకృత యూరోజోన్‌ను పటిష్టపరచే బాటలో బడ్జెట్‌, బెయిలవుట్‌ ఫండ్‌కు కొత్త అధికారాలు, యూరోజోన్‌ డిపాజిట్‌ గ్యారంటీ పథకం తదితర అంశాలపై ఆర్థిక మంత్రులు చర్చించనున్నారు. 

ఇతర అంశాలూ  కీలకమే
ఫెడ్‌ పాలసీ నిర్ణయాలు, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ ఫలితాలతోపాటు... విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు వంటి పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు వాణిజ్య వివాదాల పరిష్కారానికి చైనాతో సానుకూలంగా వ్యవహరించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గత వారం మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. దీంతో అంతర్జాతీయ పరిణామాలు సైతం మార్కెట్లకు దారిచూపగలవని నిపుణులు తెలియజేస్తున్నారు.Most Popular