చైనా మార్కెట్ ఛార్టులను గమనిస్తే.. మళ్లీ 2008 గ్యారెంటీ అనిపిస్తోంది..!

చైనా మార్కెట్ ఛార్టులను గమనిస్తే.. మళ్లీ 2008 గ్యారెంటీ అనిపిస్తోంది..!

చైనా, అమెరికా వాణిజ్య యుద్ధం ఎగుమతి దారులను భయపెడుతోందా?  ట్రేడ్ వార్‌లో పెట్టుబడిదారులు నలిగిపోనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది గ్లోబల్ మార్కెట్ విశ్లేషకుల నుంచి. ముఖ్యంగా ఎగుమతి దారులు ఈ వాణిజ్య యుద్ధం వేడిని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నందున చైనా దేశీయ వినియోగ రంగం ఆయా స్టాక్ ఇన్వెస్టర్లను కాపాడుకోవాలనుకుంటుంది.  ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన చైనా స్టాక్ మార్కెట్లలో ట్రేడర్లను రూమర్స్ , ఫియర్స్ ప్రభావితం చేస్తున్నాయి. గత కొద్ది వారాలుగా వినిమయ రంగాల్లో పతనం కనబడుతుంది. చైనా అధికారిక రిపోర్ట్స్ ప్రకారం మార్కెట్లలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇది ఇన్వెస్టర్లకు ప్రమాద ఘంటికలను మోగిస్తుందనే చెప్పాలి.


చైనా ఉత్పత్తి కంపెనీల దిగాలు...
చైనా అతిపెద్ద లిక్కర్ తయారీ సంస్థ కెవ్‌చో మొతాయ్ కార్ప్ తన అమ్మకాలు గత మూడు సంవత్సరాల కనిష్టానికి పడిపోయాయని ప్రకటించడమే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. గత నెల చివరికి అమ్మకాలు పడిపోడంతో లిక్కర్ కంపెనీ మార్కెట్ క్యాప్  దాదాపు 30 బిలియన్ డాలర్లను కోల్పోయింది. షెన్ జెన్ CSI 300 ఇండెక్స్ 22 శాతం పతనమైంది. 2008 గ్లోబల్ స్టాక్ మార్కెట్ల సంక్షోభం తరువాత ఇదే అతి పెద్ద పతనంగా చైనా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనా మార్కెట్లలో ఒడుదిడుకులకు కారణం అమెరికా , చైనాల మధ్య ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం నడుస్తుండటమే కారణం. అంతే కాకుండా చైనా మార్కెట్లలో ఆస్తులధరలు , అద్దెల భారం పెరగడం, ఇతర అంశాలకు చెల్లింపుల సామర్ధ్యం తగ్గిపోడం వంటివి చైనా మార్కెట్లను కుదేలు చేశాయి.  రుణ దాతలకు సహకరించే లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ కుప్పకూలడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.


పేరుకుపోయిన చైనా ఉత్పత్తులు...ఎగుమతులు శూన్యం
అమెరికా ఆంక్షల నేపధ్యంలో వినియోగ వస్తువుల ఎగుమతులపై పెనుభారం మోపబడ్డది. దాంతో ఎగుమతులు చేయలేక దేశీయంగానే వినియోగ వస్తువులు పడి ఉన్నాయి. దాంతో వాటిని దేశీ మార్కెట్లలో అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి రావడంతో ఉత్పత్తి కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. మరో వైపు అమెరికా , చైనా ట్రేడ్ వార్ గురించి మార్కెట్లలో నెగిటివ్‌ రూమర్లు పెరిగిపోయాయి. దాంతో ఎగుమతి దారులు వేచి చూసే ధోరణితో తమ లావాదేవీలను ఉపసంహరించుకుంటున్నారు.  ఈ కారణాల వల్ల చైనాలో ఉత్పాదక సామర్ధ్యం క్రమేపి తగ్గుముఖం పడుతోంది.  చైనా ఉన్నతాధికారులు ఈ మార్కెట్ ఒత్తిళ్ళను తట్టుకోడం కోసం కొన్ని ఉపశమన చర్యలను ప్రారంభించినా ఫలితాలు మాత్రం కనబడటం లేదనే చెప్పాలి.  చైనా ప్రముఖ ఎగుమతులైన ఆటో రంగం పూర్తిగా వినియోగ దారులు లేక వెల వెల బోతుంది. ప్రభుత్వం వాహనాల అమ్మకాలు , కొనుగోళ్ళమీద సుంకాన్ని 5శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సంక్షోభం నుండి గట్టెక్కుతామని చైనా ప్రముఖ స్టాక్ ఎనలిస్ట్, మోర్గాన్ స్టాన్లీ (హాంగ్‌కాంగ్ ) విశ్లేషకురాలు లారా వాంగ్ అంటోంది. రానున్న FY 2019 తొలి త్రైమాసికానికి పరిస్థితులు చక్కబడతాయనే ఆమె భావిస్తుంది.


మరోసారి 2008 సంక్షోభం పునరావృతం కానుందా..?
కానీ గ్లోబల్ మార్కెట్ విశ్లేషకులు మాత్రం 2008 సంక్షోభం (లెహమాన్ బ్రదర్స్ ఉదంతం) లాంటిదే మరో సారి చైనా మార్కెట్‌ను కుప్పకూల్చనుందని భావిస్తున్నారు. ఎగుమతుల మీద విపరీతమైన ఆంక్షలతో అక్కడి కంపెనీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉత్పాదకత ఎక్కువగా ఉన్న చైనా , ఇప్పుడు తాము తయారు చేసిన ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడంతో ఎంచేయాలో తోచక సతమతమౌతుంది. పేరుకుపోయిన ఉత్పత్తుల నిల్వలతో కంపెనీలు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్లలో ఆయా కంపెనీల షేర్లు పతనం కావడం మొదలెట్టాయి.  ఈ గురువారం నాటికి చైనా కంపెనీల స్టాక్స్ పతనం కావడంతో సుమారు 302 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్లు కొనసాగనుండటంతో ట్రంప్ చైనాపై సానుకూల ధృక్పథం చూపించక పోవచ్చు. ఈ చైనా, అమెరికా ట్రేడ్ వార్ నేపథ్యంలో మార్కెట్లు మరింత పతనం కావడం కొనసాగవచ్చని చైనా స్టాక్ ఎనలిస్టులు భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో చైనా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు భేటీ కానుండటం కాస్త ఆశలు రేపుతుంది. వారిరువురి భేటీ తరువాత మార్కెట్లు కొంత నిలదొక్కుకోవచ్చని హాంకాంగ్ మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. అప్పటిదాకా చైనా మార్కెట్లు అస్థిరతలోనే కొట్టుమిట్టాడుతాయని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.Most Popular