పండుగల సీజన్లో చైనా బ్రాండ్లు ఇండియాలో అమ్మిన స్మార్ట్‌ ఫోన్లెన్నో తెలుసా..?

పండుగల సీజన్లో చైనా బ్రాండ్లు ఇండియాలో అమ్మిన స్మార్ట్‌ ఫోన్లెన్నో తెలుసా..?

అధిక ఫీచర్లు, అత్యంత తక్కువ ధరకే ఆండ్రాయిడ్లు. ఇదీ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీల నినాదం. ఈ నినాదంతోనే భారత దేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో అత్యధిక శాతం వాటాను చేజిక్కిచ్చుకున్నాయి. చైనా కంపెనీలైన గ్జియోమీ, ఓప్పో, వివో , హానర్‌లు ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రు.50,000 కోట్ల  విలువైన అమ్మకాలు జరిపాయి. గత ఆర్దిక సంవత్సరం కంటే ఇది రెట్టింపుగా ఉండటం గమనార్హం. దేశీయంగా చైనా ఫోన్ల పట్ల ఆదరణ పెరగడానికి కారణం ఈ కంపెనీల స్మార్ట్ ఫోన్లలో అధిక ఫీచర్లు ఉండటమే .

ఈ నాలుగు కంపెనీలతో బాటు చైనాకు చెందిన లెనోవా, మోటరోలా , వన్‌ ప్లస్, ఇన్‌ఫినిక్స్ కంపెనీలు కూడా తమ అమ్మకాలను గణనీయంగా పెంచుకున్నాయి. ఆన్ లైన్ అమ్మకాలు, రిటైల్ షోరూముల్లో అమ్మకాలలో మిగతా ఇండియా, చైనాయేతర దేశాల స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలను అధిగమించాయి ఈ నాలుగు కంపెనీలు.  సౌత్ కొరియా, జపాన్, ఇండియా కంపెనీల స్మార్ట్ ఫోన్లు గ్లోబల్‌ బ్రాండ్లుగా ఎదిగినప్పటికీ, మన దేశంలో మాత్రం చైనా కంపెనీల  ఫోన్ల అమ్మకాలే అత్యధికంగా ఉండటం గమనార్హం. 

వినియోగ దారులు కూడా ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. సాధారణ ఐ-ఫోన్‌ ధర రు.30,000 నుండి ప్రారంభం అవుతుండగా , అదే చైనా కంపెనీ ఫోన్లు ఇందులో సగానికి కంటే తక్కువ ధర రు.9,000 నుండే దొరకుతున్నాయి. అంతే కాకుండా తక్కువ ధరకే ఐ-ఫోన్ ఫీచర్లకు సరిసమానంగా ఉండటంతో దేశీ వినియోగ దారులు చైనా ఫోన్లపై మక్కువ చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశీయంగా కూడా లాభమే...
కాగా ఈ చైనా కంపెనీల ఫోన్ల అమ్మకాలు అత్యంత వేగంగా వృద్ధి చెందడం భారత దేశ మార్కెట్లకు కూడా లాభమే అంటున్నారు ఎనలిస్టులు. దేశీయంగా ఆయా కంపెనీల ప్లాంట్లు ఏర్పడటం, ఉద్యోగ కల్పన వంటి వాటితో ఇక్కడ మార్కెట్ వృద్ధి చెందుతుందని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా రు.15,000 కోట్లతో గ్జియోమీ ఫోన్ కంపెనీ భారత దేశంలో ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఒప్పో కంపెనీ కూడా రెండు ప్లాంట్లను ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఏర్పాటు చేయనుంది. విడి భాగాల తయారీ (దేశంలోని)  కంపెనీలకు రానున్న రెండేళ్ల వరకూ సరిపడా ఆర్డర్లను ఈ చైనా కంపెనీలు ఇప్పటికే ఇచ్చేశాయి.

అంతే కాకుండా గ్జియోమీ తన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లను రు.6000-13,000 శ్రేణిలో విడుదల చేయడం వినియోగ దారులను ఆకట్టుకుంది. ఓప్పో కంపెనీ తన స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లను రు. 10,000-22,000 వరకూ నిర్ణయించింది. ఐఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్లు,  దానితో పోలిస్తే తక్కువ ధరలు ఉండటం, ఫోన్ల నాణ్యత కూడా బాగుండటంతో దేశీయంగా వేల కోట్ల అమ్మకాలు జరపగలిగాయి ఈ చైనా కంపెనీలు. ఇంత తక్కువ ధరల శ్రేణుల వల్ల దేశియ కంపెనీలు, ఇతర కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరపలేక కుదేలయ్యాయి. ఈ ధరల సునామీలో శామ్‌సంగ్ వంటి కంపెనీలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుండటం గమనార్హం. ఒప్పో కంపెనీ ఆదాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో రు. 11,994 కోట్లకు చేరుకుంది. గత ఆర్ధిక సంవత్సరం 2017లో కంపెనీ ఆదాయం 8,000 కోట్లుగా మాత్రమే ఉంది. మరో చైనా కంపెనీ అయిన వివో కూడా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరం వివో రు. 11,179 కోట్లు కాగా ఇదే గత ఆర్ధిక సంవత్సరం ఆదాయం రు. 6,292 గా ఉండింది. మార్కెట్ గణాంకాల ప్రకారం ఈ ఆర్ధిక సంవత్సరం స్మార్ట్ ఫోన్ల మార్కెట్ వాల్యూ రు. 1.5 లక్షలుగా ఉంది. ఇందులో సింహభాగం వాటాను చైనా కంపెనీలే ఆక్రమించేశాయి.

 Most Popular