ఏఎస్‌ఎం నుంచి రిలీజ్‌- షేర్ల దూకుడు

ఏఎస్‌ఎం నుంచి రిలీజ్‌- షేర్ల దూకుడు

అదనపు నిఘా చర్యల(ఏఎస్‌ఎం) జాబితా నుంచి సుమారు 81 కంపెనీలను తొలగిస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొనడంతో పలు కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్ల సమగ్రతను కాపాడటం, ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించడం వంటి బాధ్యతల్లో భాగంగా సెబీ పలు చర్యలను తీసుకుంటూ ఉంటుంది. దీనిలో భాగంగా వివిధ కంపెనీల షేర్ల ప్రైస్‌ బ్యాండ్లను మార్చడం, సమయానుగుణ కాల్‌ ఆక్షన్, ట్రేడ్‌ టు ట్రేడ్‌ విభాగంలోకి షేర్లను పంపడం వంటి చర్యలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇదే విధంగా గతంలో ఏఎస్‌ఎం జాబితాలో చేర్చిన కొన్ని కంపెనీలను తాజాగా తప్పించింది. జాబితా నుంచి బయటపడ్డ కంపెనీలలో కిరీ ఇండస్ట్రీస్, ఇమామీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బాంబే డయింగ్‌, జిందాల్‌ వరల్డ్‌వైడ్‌, అపెక్స్ ఫ్రోజెన్‌, గ్లోబస్‌ స్పిరిట్స్‌, మోర్పెన్‌ లేబ్‌, టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌, జీఎం బ్రూవరీస్‌, ధంపూర్‌, అదానీ గ్రీన్‌ 10-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఏఎస్‌ఎం నుంచి బయటపడటంతో ఈ కంపెనీల కౌంటర్లకు రెక్కలొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

రేసు గుర్రాల్లా
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ పలు కౌంటర్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కిరీ ఇండస్ట్రీస్ 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 457 వద్ద నిలిచింది. ఇక బాంబే డయింగ్‌ సైతం 10 శాతం ఎగసి రూ. 95 వద్ద ఫ్రీజయ్యింది. ఇదే విధంగా అంతా కొనేవాళ్లే గానీ అమ్మకందారులు కరవుకావడంతో ఇమామీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 10 శాతం ఎగసి రూ. 150 వద్ద, జిందాల్‌ వరల్డ్‌వైడ్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 328 వద్ద, టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ 5 శాతం లాభంతో రూ. 231 వద్ద నిలిచిపోయాయి. 

Image result for stock investors in india
జాబితా ఇంకా ఉంది
ఇతర కౌంటర్లలో అపెక్స్ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ 8 శాతం జంప్‌చేసి రూ. 386కు చేరింది. తొలుత రూ. 393 వరకూ ఎగసింది. గ్లోబస్‌ స్పిరిట్స్‌ 9.3 శాతం దూసుకెళ్లి రూ. 172 వద్ద, మోర్పెన్‌ లేబ్‌ 9.2 శాతం పెరిగి రూ. 25.6 వద్ద ట్రేడవుతున్నాయి. జీఎం బ్రూవరీస్‌ 4.3 శాతం పుంజుకుని రూ. 598కు చేరగా.. తొలుత రూ. 628 వరకూ జంప్‌చేసింది. తొలుత రూ. 171కు చేరిన ధంపూర్‌ షుగర్‌ ప్రస్తుతం 3.5 శాతం బలపడి రూ. 161 వద్ద, అదానీ గ్రీన్‌ 2.4 శాతం లాభంతో రూ. 39 వద్ద ట్రేడవుతున్నాయి.Most Popular