మీ పెట్టుబడులు మీ వారసులకే చెందాలని ఉందా ? ఈ లీగల్ పాయింట్ మరవొద్దు..

మీ పెట్టుబడులు మీ వారసులకే చెందాలని ఉందా ? ఈ లీగల్ పాయింట్ మరవొద్దు..

  పెట్టుబడి ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ. భూములు, విలువైన లోహాలు, షేర్లు, బాండ్లు వంటి రూపాల్లో మదుపు చేస్తుంటారు. గడిచిన రెండు దశాబ్దాల్లో వాటి విలువ అనేక రెట్లు పెరిగింది. ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తులు మన తర్వాత మనకి ఇష్టమైన వారికి లేదా మన వారసులకు సరిగా అందాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ ప్రక్రియలో అవగాహన లేమి కారణంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. అందుకు పరిష్కార మార్గాలేంటో చూద్దాం.  

నామినీ అప్‌డేటింగ్ ఆవశ్యకత :

చాలామంది మదుపుదారులు తమ పెట్టుబడలను సేవింగ్స్ బ్యాంకు రూపంలోనూ, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్సురెన్స్ మొ.వి రూపాల్లో  మదుపు చేస్తుంటారు. అయితే ఈ పెట్టుబడులు చేసేందుకు నామినీని డిక్లేర్ చేయడం తప్పనిసరి. చాలాసందర్భాల్లో తల్లిదండ్రులను, లేదా తమ జీవితభాగస్వాములను నామినీలుగా డిక్లేర్ పేర్కొంటారు. అయితే చాలా మంది తమ తల్లిదండ్రులను నామినీలుగా ఉంచి వారి తదనంతరం కూడా అలాగే కొనసాగిస్తూ నామినీ వివరాలను అప్‌డేట్ చేయడం మర్చిపోతుంటారు. అయితే ఇన్వెస్టర్ మరణానంతరం, మీ డిపెండెంట్లు ఆ పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవడం చాలా కష్టతరంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో కోర్టును ఆశ్రయించి తమ చట్టబద్ధ వారసత్వాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినీలను ఎప్పటి కప్పుడు అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు.

నామీని వర్సెస్ చట్టబద్ధ వారసులు:
చాలామంది ఇన్వెస్టర్లు తమ తదనంతరం నామీనీలకు సులభంగా తమ పెట్టుబడులు అందుతాయని భావిస్తుంటారు. కానీ ఇన్వెస్టర్లకు తెలియని విషయం ఏమిటంటే వారి పెట్టుబడికి నామినీలు కేవలం కస్టోడియన్ మాత్రమే. లీగల్లీ వారసులు మాత్రమే ఆ పెట్టుబడి పొందేందుకు అర్హులు.    

ఒక ఉదాహరణ చూద్దాం  : 
ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ కొంత డబ్బును ఏదైన మదుపు పథకంలో ఇన్వెస్ట్ చేసాడనుకుందాం. అలాగే దానికి నామినీని కూడా డిక్లేర్ చేశాడు. కొంత కాలం తర్వాత ఆ ఇన్వెస్టర్ మరణించాడు. అయితే ఆ పెట్టుబడి మొత్తం నామినీకి చెందింది. అయితే అంతా అనుకున్నట్లే సాఫీగా జరిగింది అని అనుకోవచ్చు. అయితే సడెన్ గా ఎవరైన చనిపోయిన ఇన్వెస్టర్ తరపున లీగల్లీ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటే మాత్రం కష్టాలు తప్పవు. మేటర్ కోర్టు తలుపు తడితే మాత్రం ఇన్వెస్టర్ కు చెందిన మొత్తం డబ్బు నామినీ నుంచి లీగల్ వారసత్వానికే చెందుతుంది. ఒక వ్యక్తి మరణానంతరం చట్టప్రకారం వారసత్వానికే  ఆస్తులు, ఇతర పెట్టుబడులపై హక్కు లభిస్తుంది. మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అందుకే మీరు పెట్టుబడులు పెట్టేముందు చట్టబద్ధంగా ఉండే కొంత లీగల్ నాలెడ్జ్ కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకం. అసలు నామినీ, లీగల్ వారసత్వం అనే పదాలకు అర్థం తెలుసుకుందాం. 

అసలు నామినీ అంటే ఎవరు ? 
ఖాతాదారుడి మరణం తరువాత అతనికి చెందిన ఆస్తులను చూసుకోవడానికి ఒక వ్యక్తిని నియమించే ప్రక్రియను నామినేషన్ అంటారు. టెక్నికల్‌గా చూస్తే నామినీ అంటే కేవలం కస్టోడియన్ మాత్రమే. నామినీ కేవలం ఆస్తిదారుడు తన వారసత్వానికే ఆస్తి బదలాయింపు చేసే ప్రక్రియలో మధ్యవర్తి మాత్రమే. అయితే కొన్ని సందర్భాల్లో నామినీయే లీగల్ వారసుడిగా నియమించే అధికారం ఆస్తిదారుడికి  ఉంది. అయితే నామినీ అనే స్టేటస్ కు అర్థం మాత్రం పెట్టుబడి లేదా ఆస్తులకు చట్టబద్ధమైన హక్కుదారుడు మాత్రం కాదు.  నామినీ ముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ, ఖాతాదారుడు వీలునామాలో పేర్కొంటే తప్ప డబ్బు, ఆస్తులపై నామినీకి ఎలాంటి హక్కు ఉండదు.

లీగల్ వారసత్వం అంటే ఏంటి ? 
చట్టబద్ధమైన వారసత్వం ప్రకారం వీలునామా లేదా వారసత్వ వారసత్వ ధ్రువీకరణ పత్రం పొందిన వ్యక్తి మాత్రమే ఆస్తికి వారసుడు. అది ఆస్తులు అయినా ఇతర పెట్టుబడులు అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. 

ఒక వేళ వీలునామా లేకపోతే ఏమౌతుంది ? 
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోయినట్లైతే, హిందూ సక్సెషన్ యాక్ట్, 1956 ప్రకారం అతనికి చెందిన సంపదను విభజిస్తారు. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులకు వర్తిస్తుంది. అదే ముస్లింలకు షరియా యాక్ట్ 1937 ప్రకారం వారసత్వాన్ని నిర్ణయిస్తారు. 

మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ? 
దానికి సింపుల్ సమాధానం బతికి ఉన్నప్పుడే వీలునామా రాసుకోవాలి. లేకపోతే ఇదే తరహాలో అనేక న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడులు ఆస్తులు ఎవరికి చెందాలి అని భావిస్తారో వారికి చెందేలా వీలునామా రాస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ పెట్టుబడులకు నిర్దేశించిన నామినీలు మాత్రం ఏమాత్రం లీగల్ వారసులు కారని గుర్తించాలి. ఒక వేళ మీ నామినీనే లీగల్ వారసుడిగా భావిస్తే మాత్రం ఆ విషయాన్ని స్పష్టంగా వీలునామాలో తెలియచేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఎలాంటి నిబంధనలు పేర్కొనకుండా ఆస్తి హక్కుదారు మరణిస్తే మాత్రం ముందుగా బ్యాంకు లేదా సదరు ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ముందుగా మరణించిన వ్యక్తి తాలుకు వ్యక్తులను సంప్రదిస్తుంది. ఒక వేళ క్లెయిం చేసుకునేందుకు ఎవరూ కూడా రానిపక్షంలో బ్యాంకు వాటిని అలాగే రీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక వేళ ఎవరైన క్లెయిం చేసుకుంటే మాత్రం చట్టప్రకారం మరణించిన వ్యక్తితో బంధాన్ని నిరూపించుకొని హిందు సక్సెషన్ యాక్ట్ కింద అందచేస్తుంది. 

వీలునామా అంటే ఏంటి ?
వీలునామా అంటే ఒక వ్యక్తి అతని మరణం తర్వాత అతని ఆస్తులను వారి వారసులకు చెందేలా తయారుచేసే ఒక అధికారిక ప్రకటనను వీలునామా అంటారు. వీలునామాను స్పష్టంగా రాయడం ద్వారా వారి వారసుల వారసత్వంపై ఎటువంటి సందేహం లేకుండా, ఆస్తులు సక్రమంగా వారికి చెందుతాయి. ఇది భారత వారసత్వ చట్టం చే నిర్వహించబడుతుంది. 

వీలునామా రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన వివరాలు : 

  •  వీలునామా రాసే వ్యక్తి 18 సంవత్సరాలు పై బడి ఉండాలి

  •  వీలునామా రాసే సమయంలో సదరు వ్యక్తి పూర్తి మానసిక ఆరోగ్యంతో స్థిరంగా ఉండాలి. 

  •  వీలునామా ఎవరి సమక్షంలో రాస్తున్నామో పేర్కొనాలి

  •  పిల్లలు మైనర్లయితే సంరక్షకుడు (గార్డియన్) పేరు రాయాల్సి ఉంటుంది. 

  •  వీలునామా రిజిస్ర్టేషన్‌ కూడా తప్పనిసరి కాదు. కాకపోతే రిజిస్ర్టేషన్‌ చేయిస్తే పకడ్బందీగా ఉంటుంది     

ఇవీ వీలునామాకు సంబంధించిన నియమ నిబంధనలు. వీటిని చక్కగా అర్థం చేసుకుని ముందు జాగ్రత్తగా మీ వారసులకు లేదా మీకు ఇష్టమైన వారికి ఎంతెంత ఆస్తి దక్కాలో ముందుగానే వీలునామా రాసుకోండి. లేకపోతే మీ తదనంతరం మీ వారసులు ఆ ఆస్తుల కోసం కొట్టుకోవడం లేదా కోర్టుల్లో పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుడదనుకుంటే ముందే వీలునామా రాయడం మంచిది.

వీలునామా రాసిన వ్యక్తి తన జీవిత కాలంలో ఎప్పుడైనా మార్చుకునే వీలుంది. వీలునామా రాసే వ్యక్తి మానసికంగా పూర్తి సన్నద్ధంగా ఉంటే తిరిగి మార్చుకునే వీలుంది. ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోనుకాకుండా లిఖిస్తున్నామ‌నే ధ్వ‌ని వీలునామాలో ప్ర‌స్పుటంగా క‌నిపించాలి.

 

Sai Krishna Pathri 

Certified Financial PlannerMost Popular