అమెరికా అటూఇటూ- చైనా దూకుడు!

అమెరికా అటూఇటూ- చైనా దూకుడు!

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ వడ్డీ రేట్ల పెంపు బాటలోనే సాగేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు కట్టుబడనున్నట్లు గత వారం చివర్లో వెలువడ్డ మినిట్స్‌ వెల్లడించాయి. గత నెల 25-26న నిర్వహించిన సమావేశంలో దేశ ఆర్థిక పురోగతి, ఉపాధి గణాంకాలు, బలపడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టడమే సరైన పరపతి విధానమంటూ సంకేతమిచ్చింది. క్రమపద్ధతిలో వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలకడైన వృద్ధిని సాధించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడింది. దీంతో మరోసారి వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బలపడ్డాయి. మరోపక్క అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతుండటం కూడా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డోజోన్స్‌ 65 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 25,444 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ మాత్రం నామమాత్రంగా 1 పాయింట్‌ నష్టంతో 2,768 వద్ద ముగిసింది. కాగా.. నాస్‌డాక్‌ 36 పాయింట్లు(0.5 శాతం) క్షీణించి 7,449 వద్ద స్థిరపడింది. ఇక యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.6 శాతం, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.3 శాతం చొప్పున వెనకడుగు వేయగా.. యూకే ఇండెక్స్ ఎఫ్‌టీఎస్‌ఈ 0.35 శాతం బలపడింది. 

Related image

పీఅండ్‌జీ అండ
ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్‌ అండ్ గ్యాంబుల్‌(పీఅండ్‌జీ) 9 శాతం దూసుకెళ్లడంతో డోజోన్స్‌కు బలమొచ్చింది. క్యూ3లో పీఅండ్‌జీ సాధించిన అంచనాలను మించిన ఫలితాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. చైనాతో వివాదాల కారణంగా అమ్మకాలు మందగించనున్నట్లు ప్రకటించడంతో హనీవెల్‌ ఇంటర్నేషనల్‌ షేరు తొలుత ఆర్జించిన లాభాలు పోగొట్టుకుని 1.1 శాతం నీరసించింది. ఫలితాలు అంచనాలను అధిగమించడంతో పేపాల్‌ హోల్డింగ్స్‌ కౌంటర్‌ దాదాపు 10 శాతం జంప్‌చేసింది. 

అధిక శాతం లాభాల్లోనే
ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 95.68కు బలపడింది. యూరో 1.15కు బలహీనపడగా.. జపనీస్‌ యెన్‌ 112.41ను తాకింది. కాగా.. ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో అత్యధిక శాతం సానుకూలంగా కదులుతున్నాయి. చైనా 3.4 శాతం జంప్‌చేయగా... హాంకాంగ్‌ దాదాపు 2 శాతం ఎగసింది. ఈ బాటలో థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.3 శాతం బలపడ్డాయి. మిగిలిన మార్కెట్లలో కొరియా, సింగపూర్‌ స్వల్పంగా లాభపడగా.. జపాన్‌ 0.3 శాతం నీరసించింది. తైవాన్‌ నామమాత్ర నష్టంతో ట్రేడవుతోంది. 

 Most Popular