షాక్‌లో ప్రపంచ 'ష్టాక్‌' మార్కెట్లు!

షాక్‌లో ప్రపంచ 'ష్టాక్‌' మార్కెట్లు!

అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు షాకిచ్చాయి. ఈ వివాదాలు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిని దెబ్బకొట్టనున్న అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో బుధవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లకు అమ్మకాల సెగ తగలగా... నేటి ట్రేడింగ్‌లో ఆసియాలో అన్ని మార్కెట్లూ భారీ నష్టాలతో కుదేలయ్యాయి. ప్రధానంగా చైనా ఇండెక్స్‌ 5.5 శాతం కుప్పకూలింది. 2014 తరువాత తిరిగి షాంఘై ఇండెక్స్‌ కనిష్టానికి చేరగా... 2016 తరువాత ఒకే రోజు సంభవించిన భారీ నష్టంగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా స్టాక్‌ మార్కెట్లో 1,000 షేర్లు అనుమతించినమేర లోయర్‌ సర్క్యూట్లను తాకడం ప్రస్తావించదగ్గ అంశమంటూ ఈ సందర్భంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. ఆసియాలో తైవాన్‌, కొరియా, జపాన్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేసియా సైతం 7-2 శాతం మధ్య పతనంకావడం విశేషం!

అమ్మకాల ఫీవర్‌
ప్రపంచస్థాయిలో చెలరేగిన ఆందోళనల కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1100 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరికి 700 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకుంది. తొలుత 33,723కు పతనమైనప్పటికీ ట్రేడింగ్‌ ముగిసేసరికి 34,001 వద్ద నిలిచింది. నికరంగా 760 పాయింట్లు కోల్పోయింది. వెరసి 34,000 పాయింట్ల మార్క్‌ ఎగువన ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 225 పాయింట్లు పడిపోయి 10,235 వద్ద స్థిరపడింది. 

Image result for stock investors in india

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ 5-1 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, హిందాల్కో, ఎంఅండ్ఎం, వేదాంతా, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ 9-4 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయితే హెచ్‌పీసీఎల్‌ 16 శాతం దూసుకెళ్లగా.. ఐవోసీ, బీపీసీఎల్‌, గెయిల్‌, యస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, జీ, హెచ్‌యూఎల్‌ 6-0.6 శాతం మధ్య జంప్‌చేశాయి.

చిన్న షేర్లు బోర్లా
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2.5-1.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1761 నష్టపోగా.. 828 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1096 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1893 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. గత రెండు రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 3047 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 3500 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.Most Popular