యూరప్‌ మార్కెట్లకూ నష్టాల సెగ

యూరప్‌ మార్కెట్లకూ నష్టాల సెగ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో బుధవారం ఉన్నట్టుండి అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో షాక్‌తిన్నాయి. ఈ బాటలో వరుసగా రెండో రోజు యూరోపియన్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1.4 శాతం, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 1.2 శాతం చొప్పున క్షీణించగా.. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.9 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

ఫెడ్‌ ఎఫెక్ట్‌ కూడా
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ పెంపు అంచనాలతో ట్రెజరీ ఈల్డ్స్‌ మళ్లీ ఊపందుకున్నాయి. ఏడేళ్ల గరిష్టం 3.35 శాతానికి ఎగశాయి.  ఫెడరల్‌ రిజర్వ్‌ ఇకపై మరింత వేగంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టే అంచనాలు బలపడుతున్నాయి. ఇందుకు అమెరికా ఉపాధి మార్కెట్‌, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటి గణాంకాలు మద్దతిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 267 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ వస్తువులపై అదనంగా సుంకాల విధింపు ఆలోచనలో ఉన్నట్లు వెలువడ్డ వార్తలు సైతం ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for Dialogue semiconductor with apple inc

నేలచూపులో
కరెన్సీ ఒడిదొడుకులు 2019లో పనితీరును దెబ్బతీయవచ్చని వెల్లడించడంతో రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ స్టుడ్‌ హేస్‌ 10 శాతం పతనమైంది. ఈ బాటలో బిజినెస్‌ పునర్వ్యవస్థీకరణ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ స్మిత్‌ 7 శాతం తిరోగమించింది. ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరగడంతో నిర్వహణలోని ఆస్తులు 80 కోట్ల పౌండ్లమేర తగ్గవచ్చంటూ పేర్కొనడంతో జూపిటర్‌ 5 శాతం నష్టపోయింది. కాగా.. యాపిల్‌తో 60 కోట్ల డాలర్ల విలువైన డీల్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో డయలాగ్‌ సెమీకండక్టర్‌ 29 శాతం దూసుకెళ్లింది.Most Popular