ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అమ్మకాల సెగ దేశీ స్టాక్ మార్కెట్లనూ తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే 1,000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ 34,000 పాయింట్ల మార్క్‌నూ కోల్పోయింది. బుధవారం అమెరికా ఇండెక్సులు 3-4 శాతం మధ్య పతనంకాగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఈ బాటలో దేశీయంగానూ మార్కెట్లు పతనబాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 622 పాయింట్లు పతనమై 34,139ను తాకింది. తద్వారా 34,000 పాయింట్ల మైలురాయి ఎగువకు చేరగా.. నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయి 10,273 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై సందేహాలు, ఫెడ్ వడ్డీ పెంపు అంచనాలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మీడియా మినహా..
ఎన్ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ 3-2 శాతం మధ్య క్షీణించాయి. అయితే మీడియా 0.8 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్, ఎస్బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే యస్ బ్యాంక్, హెచ్‌పీసీఎల్ 6 శాతం చొప్పున జంప్‌చేయగా.. ఐవోసీ, జీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్, గెయిల్ 2-0.6 శాతం మధ్య బలపడ్డాయి.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్ స్టాక్స్‌లో ఇన్ఫీబీమ్, జస్ట్‌డయల్, నిట్ టెక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్, హావెల్స్, డీఎల్ఎఫ్ 9-4.4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క ఎంఆర్‌పీఎల్, ఇండిగో, దివాన్ హౌసింగ్, బీఈఎల్, ఈక్విటాస్, చెన్నై పెట్రో, ఎంసీఎక్స్, కాల్గేట్ పామోలివ్ 8-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి.
చిన్న షేర్లు బోర్లా
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1579 నష్టపోగా.. 767 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.