యస్‌ బ్యాంక్‌, కొచ్చిన్‌ షిప్‌.. హైజంప్‌ 

యస్‌ బ్యాంక్‌, కొచ్చిన్‌ షిప్‌.. హైజంప్‌ 

జల మార్గ రవాణా కార్యకలాపాలపై దృష్టిసారించిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఇందుకు రష్యన్‌ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్‌ పతన మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం...

యస్‌ బ్యాంక్‌ దూకుడు
భారీ అమ్మకాలతో అటు మార్కెట్‌ డీలాపడగా.. ఇటు బ్యాంకింగ్‌ కౌంటర్లు సైతం నేలచూపులకే పరిమితమవుతున్నాయి. అయితే బ్యాంక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్‌ పదవీకాలాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ 2019 జనవరి వరకే పరిమితం చేయడంతో గత నెలలో దెబ్బతిన్న యస్‌ బ్యాంక్ కౌంటర్‌ మరోసారి జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 252 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 269 వద్ద గరిష్టాన్నీ, రూ. 217 దిగువన కనిష్టాన్నీ తాకడం గమనార్హం!

Image result for Cochin-shipyard

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
దేశీయంగా నీటి ఆధారిత రవాణా కార్యకలాపాలపై దృష్టి సారించిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ఇందుకు వీలుగా రష్యన్‌ సంస్థ యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్ కార్పొరేషన్‌(యూఎస్‌సీ)తో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఎంవోయూలో భాగంగా యూఎస్‌సీ ఆధునిక వెస్సల్స్‌ను సరఫరా చేయనున్నట్లు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ పేర్కొంది. యూఎస్‌సీతో భాగస్వామ్యం ద్వారా హైస్పీడ్‌ వెస్సల్స్‌, రివర్‌-సీ కార్గో వెస్సల్స్‌, ప్యాసింజర్‌ వెస్సల్స్‌, డ్రెడ్జర్లు తదితరాలను రూపొందించనున్నట్లు వివరించింది. తద్వారా దేశీయంగా తీరప్రాంతం, కాలువలు తదితర జల మార్గాల ద్వారా రవాణా కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు కంపెనీ భావిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం పెరిగి రూ. 380 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 382 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లు 75 శాతం వాటాను కలిగి ఉన్నారు.  Most Popular