కుప్పకూలిన ఆసియా మార్కెట్లు

కుప్పకూలిన ఆసియా మార్కెట్లు

ప్రపంచ ఆర్థిక వృద్ధిపై సందేహాలు.. ఫెడ్‌ వడ్డీ పెంపు అంచనాలతో బుధవారం దెబ్బతిన్న అమెరికా మార్కెట్ల బాటలో ఆసియాలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా భారత్‌సహా పలు దేశాల మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 816 పాయింట్లు పతనమై 33,945ను తాకగా.. నిఫ్టీ 252 పాయింట్లు కోల్పోయి 10,208 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 5-2 శాతం మధ్య క్షీణించాయి.

బ్లూచిప్స్‌ డీలా
నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ 9-4 శాతం మధ్య కుప్పకూలాయి. బ్లూచిప్స్‌లో హెచ్‌పీసీఎల్‌ 4.4 శాతం జంప్‌చేయగా.. జీ, బీపీసీఎల్‌, ఐవోసీ, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. కాగా... డెరివేటివ్స్‌లో నిట్‌ టెక్‌, జస్ట్‌డయల్‌, ఇన్ఫీబీమ్‌, జిందాల్‌ స్టీల్‌, పిరమల్‌, జేపీ, దివాన్‌ హౌసింగ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 8-6 శాతం మధ్య పతనమయ్యాయి. 

బ్యాంక్స్‌ డౌన్‌
పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 5.2 శాతం పతనమైంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఓబీసీ, కెనరా, పీఎన్‌బీ, సిండికేట్‌, బీవోబీ, విజయా బ్యాంక్‌ 6-3 శాతం మధ్య నష్టపోయాయి.

Related image

ఆసియా బోర్లా
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి. తైవాన్‌ 6.5 శాతం కుప్పకూలగా.. చైనా, జపాన్, హాంకాంగ్‌, దక్షిణ కొరియా,  సింగపూర్‌, థాయ్‌లాండ్‌ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో ఇండొనేసియా దాదాపు 2 శాతం నష్టపోయింది. కాగా.. బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ముగిశాయి. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 2.25 శాతం చొప్పున పతనంకాగా.. యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1.3 శాతం తిరోగమించింది. 

కారణాలివీ..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం కల్పించనున్నట్లు ఐఎంఎఫ్‌ తాజాగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఇకపై మరింత వేగంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టే అంచనాలు బలపడుతున్నాయి. ఇందుకు అమెరికా ఉపాధి మార్కెట్‌, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటి గణాంకాలు మద్దతిస్తున్నాయి. ఫలితంగా ట్రెజరీ ఈల్డ్స్‌ ఇప్పటికే ఏడేళ్ల గరిష్టాలకు చేరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ప్రధానంగా స్టాక్స్‌లో అమ్మకాలకు ఎగబడుతున్నట్లు వివరించారు. Most Popular