రెండో రోజూ ఏవియేషన్‌ షేర్ల దూకుడు

రెండో రోజూ ఏవియేషన్‌ షేర్ల దూకుడు

వరుసగా రెండో రోజు ఏవియేషన్‌ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. పతన మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మూడు లిస్టెడ్‌ కంపెనీల షేర్లూ లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో స్పైస్‌జెట్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 71 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 68 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఎన్‌ఎస్ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 4.3 శాతం ఎగసి రూ. 197 వద్ద ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ షేరు 7 శాతం పురోగమించి రూ. 189కు చేరింది. ఈ బాటలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ 7 శాతం దూసుకెళ్లింది. రూ. 797 వద్ద ట్రేడవుతోంది. ముందురోజు ఈ షేరు 2 శాతం బలపడి రూ. 744 వద్ద స్థిరపడింది.

Image result for spice jet jet airways indigo

ఎక్సయిజ్‌ తగ్గింపు
ఇటీవల ఇంధన ధరల పెరుగుదల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఏవియేషన్‌ రంగానికి ఉపశమనం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం   వైమానిక ఇంధన(ఏటీఎఫ్‌) ధరలపై ఎక్సయిజ్‌ డ్యూటీని తగ్గించడంతో ఇన్వెస్టర్లకు జోష్‌వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నేటి నుంచీ అమల్లోకి వచ్చే విధంగా జెట్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) ధరలపై ఎక్సయిజ్‌ సుంకాన్ని 3 శాతం తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఏటీఎఫ్‌పై ఎక్సయిజ్‌ డ్యూటీ 14 శాతంగా అమలవుతోంది. తాజా తగ్గింపుతో 11 శాతానికి దిగివచ్చింది. నిజానికి 2014 వరకూ 8 శాతంగా ఉన్న ఏటీఎఫ్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని ప్రభుత్వం 14 శాతానికి హెచ్చించింది. వైమానిక సర్వీసుల నిర్వహణలో ఇంధన వ్యయాల వాటా 40 శాతం కావడంతో ఎక్సయిజ్‌ సుంకం తగ్గింపు వార్తలు ఈ రంగంలోని షేర్లకు డిమాండ్‌ పెంచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.Most Popular