వరుసగా రెండో రోజు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ప్రొడక్టుల తయారీ కంపెనీల కౌంటర్లు జోరు చూపుతున్నాయి. భారీ అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లలోనూ ఈ కౌంటర్లు లాభాలతో సందడి చేస్తుండటం విశేషం. విదేశీ రీసెర్చ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ప్రొడక్టుల తయారీ సంస్థలు హెచ్ఈజీ లిమిటెడ్, గ్రాఫైట్ ఇండియా కౌంటర్లకు 'బయ్' రేటింగ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం..
హెగ్ హైజంప్
రీసెర్చ్ సంస్థ బీవోఏఎంఎల్ షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో హెచ్ఈజీ లిమిటెడ్ కౌంటర్ రెండో రోజూ దూకుడు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్ఈజీ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 4057 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఈ కౌంటర్ 20 శాతం దూసుకెళ్లి రూ. 3889 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ షేరుకి రూ. 6700 టార్గెట్ ధరను బీవోఏఎంల్ ప్రకటించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. క్యాష్ ఫ్లో, విస్తరణ నేపథ్యంలో ఇకపై హెగ్ భారీ డివిడెండ్లను చెల్లించే వీలున్నట్లు బ్రోకింగ్ సంస్థ అంచనా వేసింది.
గ్రాఫైట్ ఇండియా
రీసెర్చ్ సంస్థ బీవోఏఎంఎల్ షేరు కొనుగోలుకి సిఫారసు చేయడంతో గ్రాఫైట్ ఇండియా కౌంటర్‌కు మళ్లీ కిక్ వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 871 దాటి ఫ్రీజయ్యింది. బుధవారం సైతం ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. రూ. 1550 టార్గెట్ ధరను బీవోఏఎంల్ ప్రకటించడంతో గ్రాఫైట్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. గ్రాఫైట్ రంగంలో చౌకగా లభిస్తున్న కంపెనీ గ్రాఫైట్ ఇండియా అంటూ బీవోఏఎంఎల్ పేర్కొంది. ఈ ఏడాది సాధించనున్న పటిష్ట ఫలితాలు, క్యాష్ ఫ్లో నేపథ్యంలో ఈ షేరుకి బయ్ రేటింగ్‌ను ఇచ్చినట్లు తెలియజేసింది.