1,000 పాయింట్లు మైనస్‌-34,000 దిగువకు!

1,000 పాయింట్లు మైనస్‌-34,000 దిగువకు!

వరుస పతనాలకు చెక్‌ పెడుతూ వచ్చిన రిలీఫ్‌ ర్యాలీ ఒక్కరోజుకే పరిమితమైంది. అమెరికాసహా ప్రపంచ మార్కెట్ల పతనంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు బెంబేలెత్తడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే భారీ అమ్మకాలకు క్యూకట్టారు. దీంతో సెన్సెక్స్‌ ఏకంగా 1,000 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. వెరసి 34,000 పాయింట్ల మార్క్‌ దిగువన మొదలైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 966 పాయింట్లు పడిపోయి 33,795కు చేరింది. నిఫ్టీ సైతం 305 పాయింట్లు దిగజారి 10,155 వద్ద ట్రేడవుతోంది. 

కారణాలున్నాయ్‌
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నట్లు ఐఎంఎఫ్‌ వేసిన అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. మరోపక్క అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుబాటలో సాగేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ట్రెజరీ ఈల్డ్స్‌ ఏకంగా ఏడేళ్ల గరిష్టానికి చేరాయి. దీంతో ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ముడిచమురు ధరల పెరగుదల డాలరుతో మారకంలో రూపాయికీ షాకిస్తోంది. వెరసి దేశీయంగా ఇటీవల మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. 

Image result for sensex tumbles

నేలచూపులోనే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ అమ్మకాలతో కుదేలయ్యాయి. మొత్తం అన్ని ఇండెక్సులూ 4-2.5 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐషర్‌, ఎస్‌బీఐ, వేదాంతా, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ 7.5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో కేవలం ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ 1.7-1 శాతం మధ్య బలపడ్డాయి.

డెరివేటివ్స్‌ తీరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో బలరామ్‌పూర్‌ 5.5 శాతం జంప్‌చేయగా.. ఇంటర్‌గ్లోబ్‌ 1 శాతం పుంజుకుంది. అయితే జస్ట్‌డయల్‌, దివాన్‌ హౌసింగ్‌, చోళమండలం ఫైనాన్స్‌, కేన్‌ఫిన్‌ హోమ్‌, హెచ్‌సీసీ, జేపీ, అదానీ పవర్‌ 9.4-5 శాతం మధ్య కుప్పకూలాయి.

చిన్న షేర్లు బోర్లా
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1302 నష్టపోగా.. 225 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular