ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నీరసంగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 118కాగా.. బీఎస్ఈలో 12 శాతం(రూ. 14) నష్టంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 109 వద్ద గరిష్టాన్నీ, రూ. 102.40 వద్ద కనిష్టాన్నీ తాకింది. ప్రస్తుతం రూ. 107 వద్ద ట్రేడవుతోంది.
ఇష్యూకి స్పందన అంతంతే
ఈ నెల 1న పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న కంపెనీ రూ. 340 కోట్లను సమీకరించింది. అయితే తొలుత ఇష్యూకి తగిన స్పందన లభించకపోవడంతో ప్రభుత్వం గడువును మూడు రోజులపాటు పొడిగించింది. దీంతోపాటు ప్రైస్‌బ్యాండ్‌ను సైతం సవరించింది. సెప్టెంబర్ 26న ముగియాల్సిన ఇష్యూ అక్టోబర్ 1 వరకూ కొనసాగింది. తొలుత నిర్ణయించిన ప్రైస్-బ్యాండ్ రూ. 115-118ను ప్రభుత్వం తదుపరి రూ. 114-118గా సవరించింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 2.92 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా... 2.97 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి ఇష్యూ 1.02 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది.
కంపెనీ బ్యాక్‌గ్రౌండ్
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేసిన జీఆర్ఎస్ఈ లిమిటెడ్ ప్రధానంగా దేశ నావికా దళం, తీరప్రాంత రక్షణ విభాగాలకు అవసరమయ్యే ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఆధునిక, వ్యూహాత్మర వార్‌షిప్పులను తయారు చేస్తోంది. వీటిలో ఫ్రైగేట్స్, ఫ్లీట్ ట్యాంకర్లు, సర్వే వెస్సల్స్, ఆఫ్‌షోర్, ఆన్‌షోర్ ప్యాట్రోల్ వెస్సల్స్, హోవర్ క్రాఫ్ట్స్ తదితరాలను రూపొందిస్తోంది. అంతేకాకుండా పోర్టబుల్ ప్రీఫ్యాబ్రికేటెడ్ స్టీల్ బ్రిడ్జిలు, మెరైన్ పంపులు, డీజిల్ ఇంజిన్లు, వార్షిప్పులకు అవసరమయ్యే డెక్ మెషీనరీలను సైతం తయారు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ విలువ రూ. 20,803 కోట్లుకాగా.. దేశ నావికాదళం నుంచే దాదాపు 99 శాతం ఆర్డర్లు లభించినట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.