ఏదీ పండుగ సందడి...?

ఏదీ పండుగ సందడి...?

ఈ సంవత్సర ఆరంభం నుండి దేశీయ షేర్ మార్కెట్లు పతనం బాటలోనే నడుస్తున్నాయి.  మెటల్, మోటర్ ఫీల్డ్, ఫార్మా, కమోడిటీస్ ఇలా ఏ రంగం చూసినా షేర్లు తిరోగమన సూచీలతోనే ఆహ్వానం పలుకుతున్నాయి. బుల్లిష్ మార్కెట్ , బేరిష్ మార్కెట్లు రెండూ ఒడిదుడుకులకు లోనౌతున్నాయి. ఇక స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలైతే పూర్తిగా నేల మట్టాన్ని చవి చూశాయి. దాదాపు 70 శాతం ఆ కంపెనీల మార్కెట్ వాల్యూలు పడిపోయాయి. మేకిన్ ఇండియా, ఇండియా  ఈజ్ షైనింగ్ అంటున్న భారత ప్రభుత్వం కూడా పతనమౌతున్న మార్కెట్లను ఆదుకోడానికి కనీస చర్యలు కూడా తీసుకోలేదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్లో ద్రవ్య లభ్యత తగ్గిపోవడం, బ్యాంకింగ్  షేర్లు డీలా పడటం, నాన్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కంపెనీ IL&FS దివాలా ప్రక్రియ ఇవ్వన్నీ   మదుపర్ల ఆశలను ఆవిరి చేసింది.


పండుగ మూడ్ ఆవిరి...!
మరో వైపు నానాటికీ డాలర్‌తో రూపీ మారకపు విలువ పడిపోవడం, చరిత్రలోనే గరిష్టంగా రికార్డు స్థాయిలో ఒక డాలర్‌కు రు.74.67 గా రూపీ విలువ పడిపోవడం మార్కెట్ ను కకావికలం చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, ఇరాన్ పై అమెరికా విధించిన చమురు ఆంక్షలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ద్రవ్య పరపతి విధానంపై ఆర్‌బీఐ ప్రకటన చేస్తుందని ఆశగా ఎదురు చూసిన మార్కెట్ వర్గాలపై నీళ్ళు చల్లింది RBI.  రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను తగ్గించమని, యథాతథ స్థితిని కొనసాగిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య వార్ కూడా మార్కెట్లపై పెను ప్రభావమే చూపింది. అమెరికా భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ ట్రంప్ అప్పుడప్పుడు భారత్ పై విద్వేషాన్ని చూపెడుతూ ఉంటారు. అమెరికా.. ఎగుమతులు, దిగుమతులపై సుంకాల్ని పెంచూతూ మార్కెట్లలో అనిశ్చితిని , అసహనాన్ని పెంచుతుంది.
కుదేలైన మోటార్ రంగం
గతంలో ప్రతి ఒక్కరూ తమ పోర్ట్ ఫోలియోలో ఉంచుకోవాలనుకున్న మారుతీ సుజుకీ షేర్ ఇప్పుడు వారిని వణికిస్తుంది. 2017లో మారుతీ షేర్ రు. 9,996 వరకూ పలికింది. ముందు ముందు మరింత పెరుగుతుందని అందరూ భావించారు. కానీ గత మూడు నెలలుగా  మారుతీ షేర్ క్షిణీస్తూ.. బుధవారం నాటికి -3.07శాతం తగ్గి రు. 6,691.90 వద్ద నమోదైంది.
ఇక టాటా మోటార్స్ మంగళవారం నాటికి 13.40 శాతం  నష్టపోయి...183.54 వద్ద నమోదైంది. ఇక బజాజ్ ఆటో
ఒక్కటే నిలకడైన వృద్ధిని చూపిస్తూ 2.32 శాతం పెరిగి రు. 2,605.45 వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా దేశీయంగా పండగల సీజన్‌లో వాహన కంపెనీల అమ్మకాలు జోరందుకోడంతో ఆయా కంపెనీల షేర్లు పుంజుకుంటాయి. కానీ.. ప్రభుత్వ నిర్ణయాలు, ద్రవ్య వినిమయం తగ్గడం వంటి కారణాలతో వినియోగ దారులు వస్తు కొనుగోళ్ళపై ఆసక్తి ప్రదర్శించడం లేదు. ఇదే వాహన షేర్లు కుదేలవడానికి ముఖ్య కారణం.


కమోడిటీస్ మార్కెట్లు కూడా ఆశాజనకంగా కనిపించడం లేదు. జీఎస్టీ ఇప్పటికి కొరుకుడు పడని కొయ్యలానే కనిపిస్తుంది వినియోగదారుడికి.  వస్తు ఉత్పత్తులపై , కన్జ్యూమర్ మార్కెట్లో ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉందో అవగాహన ఉండటం లేదు. ఒక వస్తువు మీద జీఎస్టీ తగ్గినపుడు ఆ వస్తువు ధరను వ్యాపారి తగ్గించాలి. కానీ.. ఈ విషయంలో వినియోగదారుడి తెలియని తనాన్ని కంపెనీలు , వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. హిందూస్థాన్ యూనీ లివర్ అంతటి పెద్ద కంపెనీ కూడా జీఎస్టీ రాయితీలను కస్టమర్లకు అందించలేదని.. విచారణను కూడా ఎదుర్కొంటుంది.


భారత దేశం వంటి విస్తారమైన మార్కెట్ కలిగిన ఆర్ధిక వ్యవస్థలో సెంటిమెంట్లు, పండుగ సీజన్లు ఎక్కువ. మరి ఇప్పుడు రాబోతున్న పెద్ద పండుగలైన దసరా, దీపావళి సీజన్లలో పలు కంపెనీలు పెద్ద పెద్ద , ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించినప్పటికీ... వినియోగ దారుడు అమ్మకాలను పెంచుతాడా, లేదో వేచి చూడాలి. ఎందుకంటే.. ఉత్పత్తుల అమ్మకాలే..షేర్ల పెరుగుదలకు కారణం కదా.Most Popular