అయ్యో రూపాయ్‌... ఒకటే జారుడు!

అయ్యో రూపాయ్‌... ఒకటే జారుడు!

ఓవైపు దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు, మరోవైపు చమురు ధరల సెగ రూపాయికి షాక్‌నిస్తూనే ఉన్నాయి. వీటికితోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుండటంతో డాలరు బలపడుతోంది. ఫలితంగా దేశీ కరెన్సీ గత కొద్ది రోజులుగా నిరవధిక పతనాన్ని చవిచూస్తోంది. ఈ బాటలో మరోసారి బలహీనపడింది. డాలరుతో మారకంలో తాజాగా సరికొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ప్రస్తుతం రూపాయి 21 పైసలు(0.19 శాతం) క్షీణించి 74.27కు చేరింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. గురువారం సైతం రూపాయి 30 పైసలు కోల్పోయి 74.06 వద్ద ముగిసింది. శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథ పాలసీ అమలును ప్రకటించిన నేపథ్యంలో రూపాయి 29 పైసలు క్షీణించి 73.77 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అదే రోజు ఇంట్రాడేలో 74.22 వరకూ జారింది. కాగా.. నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో రూపాయి 19 పైసలు పుంజుకుంది. 73.87 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఊగిసలాట మధ్య నీరసిస్తూ వచ్చింది. 

అదేపనిగా..
ఈ ఏడాది అంటే 2018లో ఇప్పటివరకూ డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 16 శాతం పతనమైంది. అక్టోబర్‌లో ఇంతవరకూ 2 శాతం వెనకడుగు వేయడం గమనార్హం! ఈ ఏడాది సుమారు 180 ట్రేడింగ్‌ సెషన్లకుగాను 101 సెషన్లలో రూపాయి క్షీణ పథంలోనే పయనించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Related image

పలు కారణాలు
గత వారం ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మరోపక్క గత వారం బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 86 డాలర్లను అధిగమించింది. ఇది నాలుగేళ్ల గరిష్టంకాగా.. నైమెక్స్‌ చమురు సైతం 76 డాలర్లను దాటింది. మరోపక్క ఫెడరల్ రిజర్వ్‌ డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేటును పెంచనున్న అంచనాలు పెరిగాయి. ఇందుకు పుంజుకున్న ఉపాధి మార్కెట్‌, 49ఏళ్ల కనిష్టానికి చేరిన నిరుద్యోగిత వంటి అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఫెడ్‌ వడ్డీ పెంపు అంచనాలతో 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 3.23 శాతాన్ని తాకాయి. ఈ అంశాలకుతోడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం, దేశీయంగా పెరుగుతున్న వాణిజ్య లోటు వంటి అంశాలు సైతం సెంటిమెంటును దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. Most Popular