టాటా మోటార్స్‌- ఏడేళ్ల కనిష్టం!

టాటా మోటార్స్‌- ఏడేళ్ల కనిష్టం!

దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి.  దీంతో ఈ షేరు 7 ఏళ్ల కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 17.4 శాతం పతనమై రూ. 176 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 170కు జారింది. వెరసి వెరసి 2011 జులై తరువాత తిరిగి టాటా మోటార్స్‌ షేరు కొత్త కనిష్టానికి చేరింది. పలు కారణాలతో ఇటీవల దేశీ ఆటో రంగ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్న విషయం విదితమే. తాజాగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న టాటా మోటార్స్‌ నేలచూపులకు కారణాలు చూద్దాం..  

కారణాలివీ..
ప్రధానంగా బ్రిటిష్‌ లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్) పనితీరు ఆధారంగా గత కొంతకాలంగా టాటా మోటార్స్‌ షేరు గరిష్ట స్థాయిలను అందుకుంటూ వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఇటీవల దేశీయంగా వాణిజ్య, ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు పుంజుకుంటున్న సమయంలో జేఎల్‌ఆర్‌ విక్రయాలు వెనకడుగు వేస్తున్నట్లు తెలియజేశారు. సెప్టెంబర్‌లో జేఎల్‌ఆర్‌ ప్రపంచ అమ్మకాలు(గ్లోబల్‌ సేల్స్‌) 12.3 శాతం క్షీణించాయి. 57,114 యూనిట్లకు పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. చైనా నుంచి డిమాండ్‌ మందగించడం ప్రభావం చూపినట్లు పేర్కొంది. చైనాలో జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు సెప్టెంబర్‌లో 46 శాతంపైగా నీరసించాయి. ఇందుకు వాణిజ్య వివాదాలు, దిగుమతి సుంకాల వంటి అంశాలు ప్రభావం చూపినట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. ఉత్తర అమెరికాలోనూ 7 శాతం వెనకడుగు వేశాయి.  వేశాయి. కాగా.. తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ నెల చివర్లో  పశ్చిమ మిడ్‌ల్యాండ్‌లోని ప్లాంటును రెండు వారాల పాటు మూసివేయనున్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. అయితే కార్మికులను తొలగించబోమని.. మూసివేత కాలానికి వేతన చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. 

Image result for JLr 

జాగ్వార్‌ భేష్‌
సెప్టెంబర్‌లో విడిగా జాగ్వార్‌ బ్రాండ్‌ విక్రయాలు 4.4 శాతం పుంజుకుని 19,146 యూనిట్లను తాకినట్లు తెలియజేసింది. అయితే ల్యాండ్‌రోవర్‌ అమ్మకాలు మాత్రం దాదాపు 19 శాతం క్షీణించి 37,968 యూనిట్లకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో సమస్యాత్మక పరిస్థితులు కనిపిస్తున్నాయని.. దీంతో లాభదాయకతను నిలుపుకునేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు టాటా మోటార్స్‌ యాజమాన్యం తెలియజేసింది. కాగా.. గత ఆరు నెలల్లో టాటా మోటార్స్‌ షేరు 43 శాతం తిరోగమించింది. ఇదే సమయంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 2.5 శాతం పెరిగింది.Most Popular