ఆటో... రివర్స్‌ గేర్‌?!

ఆటో... రివర్స్‌ గేర్‌?!

గత కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతున్న మార్కెట్లలో ఆటో రంగ కౌంటర్లకూ అమ్మకాల సెగ తగులుతోంది. ఇందుకు పలు కారణాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బీఎస్‌ఈలో ఆటో రంగ ఇండెక్స్‌ తాజాగా 21 నెలల కనిష్టాన్ని తాకింది. 2016 డిసెంబర్‌ 27 తరువాత ఆటో ఇండెక్స్‌ 19,627 వద్ద మళ్లీ కనిష్టాన్ని తాకింది. గత నెల అంటే సెప్టెంబర్‌ మొదలు ఆటో ఇండెక్స్‌ 20 శాతం పతనమైంది. ఇదే సమయంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 11 శాతమే నష్టపోవడం గమనించదగ్గ అంశం. ఆటో రంగ షేర్ల తీరు, ఇందుకు కారణాలు తదితర వివరాలు పరిశీలిద్దాం...

Image result for petrol pump

52 వారాల కనిష్టాలకు
నేటి ట్రేడింగ్‌లో తొలుత బీఎస్ఈలో బజాజ్‌ ఆటో రూ. 2500 వద్ద, మారుతీ సుజుకీ రూ. 6780 దిగువన, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ రూ. 479 దిగువన, ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ రూ. 568 వద్ద, టాటా మోటార్స్‌ రూ. 213 దిగువన 52 వారాల కనిష్టాలను తాకాయి. సెప్టెంబర్‌ నెలలో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు మందగించడం, అధిక ఇంధన ధరలు, దేశంలోని పలు ప్రాంతాలలో రుతుపవనాల ప్రభావం వంటి అంశాలు ఆటో రంగానికి సమస్యలు సృష్టించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌(జులై-సెప్టెంబర్‌)లో 4 వీలర్స్‌, ట్రాక్టర్ల అమ్మకాలు నామమాత్రంగానే నమోదయ్యాయి. అయితే ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు మాత్రం రెండంకెల వృద్ధిని సాధించాయి.  

నెల రోజుల్లో నేలచూపు
గత నెల రోజుల్లో ఎస్కార్ట్స్‌ 27 శాతం పతనంకాగా.. ఐషర్‌, ఫోర్స్‌ మోటార్స్‌, మదర్‌సన్ సుమీ 25 శాతం చొప్పున తిరోగమించాయి. ఈ బాటలో టాటా మోటార్స్‌, మారుతీ, మిండా ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎం, ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ 22-20 శాతం మధ్య క్షీణించాయి. ఇదేవిధంగా మిండా కార్ప్‌, టీవీఎస్‌ మోటార్, అశోక్‌ లేలాండ్, హీరోమోటో, బజాజ్ ఆటో, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, అమరరాజా, బాష్‌ సైతం 19-11 శాతం మధ్య నీరసించాయి.

Image result for speed breakers ahead

పలు కారణాలు
స్టీల్‌, రబ్బర్‌ తదితర ముడిసరుకుల వ్యయాలు పెరిగినప్పటికీ ఆటో కంపెనీలు ఇందుకు అనుగుణంగా ధరలను పెంచే పరిస్థితులు నెలకొనకపోవడంతో మార్జిన్లపై ఒత్తిడిపడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగిపోవడం, వడ్డీ రేట్లు సైతం బలపడుతుండటం వంటి పరిస్థితులు వాహన విక్రయాలకు బ్రేకులు వేస్తున్నట్లు తెలియజేశారు. దీనికితోడు ఇటీవల బీమా నియంత్రణ సంస్థ(ఐఆర్‌డీఏ) వ్యక్తిగత ప్రమాద బీమాను పెంచడంతోపాటు తప్పనిసరి చేయడంతో వినియోగదారులకు వాహన వ్యయాలు పెరగనున్నట్లు వివరించారు. 

పండుగల కళ?
ఇప్పటికే పండుగల సీజన్‌ ప్రారంభంకావడంతో ఇకపై వాహన విక్రయాలు ఊపందుకోవచ్చునని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతు పవనాల ప్రభావం తగ్గిపోవడం కూడా వాహన అమ్మకాలకు ఊపునివ్వనున్నట్లు భావిస్తున్నారు. ప్రధానంగా కార్లు, ద్విచక్ర వాహన విక్రయాలు జోరందుకునే వీలున్నట్లు చెబుతున్నారు. వీటితోపాటు ఇప్పటికే వేగవంత వృద్ధి సాధిస్తున్న వాణిజ్య వాహన అమ్మకాలు పైతం పుంజుకుంటే తిరిగి ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్‌ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.Most Popular