NBFCల పతనానికి సవాలక్ష కారణాలు...

NBFCల పతనానికి సవాలక్ష కారణాలు...

2013 సంవత్సరం దాకా NBFCల హవా భారత దేశంలో ఉచ్ఛస్థితిలో ఉండేది. నాన్ బ్యాంకింగ్ షేర్లు టాప్ లిస్ట్ లో ఉండేవి. IL&FS రంగంలోకి వచ్చాక వాటి పరిస్థితే మారిపోయింది. అధిక లాభాల నమోదుకై ప్రతి NBFC కంపెనీ ఆరాట పడటం కూడా వాటి పురోభివృద్ధిపై ప్రభావం చూపసాగాయి. బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడుల పట్ల విముఖత చూపడంతో ఈ నాన్ బ్యాంకింగ్ కంపెనీలు విరివిగా అవకాశాలు అందిపుచ్చుకున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాయి. గృహ, వాహన రుణాల విషయంలో ఒకానొక దశలో బ్యాంకులను మించి మరీ రుణాలు మంజూరు చేసాయి. ఇక్కడే వాటి పతనానికి బీజాలు పడ్డాయి. NBFCలు నిధులు సమీకరించుకున్నాక... వినియోగ దారులకు రుణాలు జారీ చేస్తాయి. ఉదాహరణకు ఓ వినియోగ దారుడికి దీర్ఘకాలిక ప్రాతిపదికన ఒక కారు లోన్‌గా రు. 10 లక్షల రుణాన్ని మంజూరు చేసింది ఓ NBFC .  ఈ లోన్ కాల వ్యవధి సుమారు 52 నెలలు (దీర్ఘకాలికం) అనుకుందాం. లోన్ ఇచ్చిన నాన్ బ్యాంకింగ్ సంస్థ ఆ రు.10 లక్షలను ఇన్వెస్టర్ల దగ్గర నుండి 12 నెలల్లో తీరుస్తామని తీసుకుంది. అంటే సంవత్సర కాలంలో కంపెనీ కార్యకలాపాలు వృద్ధి చెందుతాయని, వ్యాపార ట్రాన్సక్షన్స్ నుండి రు. పది లక్షల రుణాన్ని తీర్చవచ్చని ఆ NBFC అంచనా .అంటే ఒక దీర్ఘకాలిక రుణం ఇవ్వడం కోసం మరో చోట నుండి షార్ట్ టర్మ్ లోన్ తీసుకొచ్చింది. ఇక్కడే ఆయా కంపెనీలు దెబ్బతినడం మొదలెట్టాయి.

సంవత్సర కాలంలో తిరిగి చెల్లించాల్సిన రుణ బకాయిలను చెల్లించలేక పోవడంతో .. క్రమంగా కంపెనీ నగదు లభ్యత రేటింగ్స్ పడిపోవడం మొదలైంది. ఇదే IL&FS లో జరిగింది. కమర్షియల్ పేపర్స్ జారీ చేసిన కంపెనీ వాటిని విలువ కంటే తక్కువగా అమ్ముకోవడం, వేల కోట్ల రూపాయిల బకాయిలను చెల్లించలేక పోవడంతో రేటింగ్ సంస్థల చేతిలో డిఫాల్టర్‌గా ముద్ర వేయించుకుంది.
లాంగ్ టర్మ్ కోసం...షార్ట్ టర్మ్...
రుణాలపై వడ్డీ రేట్లు కూడా ఈ నెలలో గత నాలుగు సంవత్సరాల గరిష్టానికి చేరడంతో IL&FS లాంటి కంపెనీలు కుప్పకూలడానికి మరో కారణం. మనీ లభ్యత  కష్టతరం కావడంతో ...మార్కెట్లలో NBFCల పరిస్థితి కనా కష్టంగా మారింది.  NBFCల పతనానికి మరో కారణం... తీసుకున్న రుణాలను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం,  దీర్ఘకాలిక రంగంలో ఇన్వెస్ట్ చేయడం కోసం షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకోవడం కూడా NBFC లు చేసిన మరో పెద్దతప్పిదం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల అత్యుత్సాహం, అవగాహనా రాహిత్యం , వేగంగా లాభాల సంపాదించాలనుకోవడం ఇవ్వన్నీ IL&FS లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పతనానికి కారణంగా చెప్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.
NBFCల షేర్లపై పతనం కొనసాగొచ్చు...
గత శుక్రవారం మార్కెట్లలో NBFC కంపెనీల షేర్లు క్షీణతను చవి చూశాయి. మదుపర్లలో ఉన్న భయాందోళనలే ఈ   పతనానికి నాంది పలికాయి. బజాజ్ హోల్డింగ్స్&ఇన్వెస్ట్‌మెంట్స్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, మహీంద్ర&మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీస్ , ఎడ్‌లెవీస్ ఫైనాన్స్ వంటి కంపెనీలు 7 శాతం నష్టపోయాయి. ఈ పతనం ఈ వారం కూడా కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా NBFCలు నిధుల సమీకరణ కోసం రిటైల్ బాండ్స్ ను విడుదల చేస్తుంటాయని, కానీ... నగదు లభ్యత కొరత వల్ల అవి సక్సెస్ కాలేక పోతున్నాయని శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ మెనేజింగ్ డైరెక్టర్ ఉమేష్ రేవంకర్ అంటున్నారు. అందువల్లే తమ కంపెనీ లాంగ్ టర్మ్ ఫండ్స్ కోసమే యత్నిస్తున్నామని, ఆ దిశగా సఫలం అయ్యామని చెప్తున్నారు.  ప్రస్తుతం నడుస్తున్న పండుగల సీజన్ కూడా NBFCలకు  లాభదాయకంగా లేదు. వినియోగదారులు పండగ అవసరాలు, పెళ్ళి వేడుకలకు డబ్బులు ఖర్చు చేయనుండటంతో గృహ, వాహన కొనుగోలు రంగాల్లోలో వ్యాపారం మందగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ అథారిటీ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు చెల్లింపు నష్టాలు ఎదరు కాకుండా  తగు చర్యలను తీసుకోవాలంటూ కఠినంగా హెచ్చరించడం ఇక్కడ గమనార్హం.Most Popular