ఆవాస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిస్టింగ్‌ నేడు

ఆవాస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిస్టింగ్‌ నేడు

గత నెల చివరి వారంలో ఐపీవో వచ్చిన రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌ నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. సెప్టెంబర్‌ 27న ముగిసిన ఇష్యూకి 94 శాతం బిడ్స్‌ మాత్రమే దాఖలయ్యాయి. ఇష్యూకి ప్రైస్‌-బ్యాండ్‌(ఒక్కో షేరు) రూ. 818-821 కాగా.. తద్వారా కంపెనీ రూ. 1734 కోట్లు సమీకరించింది. 

బిడ్స్‌ తీరిదీ
ఐపీవోలో భాగంగా దాదాపు 1.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. సుమారు 1.44 కోట్ల షేర్లకోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 2.77 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించగా.. సంపన్న వర్గాల(నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌) కేటగిరీలో 26 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి సైతం స్వల్పంగా 25 శాతమే దరఖాస్తులు లభించాయి. కాగా.. ఐపీవో ముందురోజు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 520 కోట్లను కంపెనీ సమీకరించింది. యాంకర్‌ సంస్థలలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, అబుధబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ బిహేవ్‌, డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్, ఎస్‌బీఐ లైఫ్‌ తదితరాలున్నాయి.

కంపెనీ వివరాలివీ
దేశ పశ్చిమ, ఉత్తర ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరించిన రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌కు అనుబంధ సంస్థగా ప్రారంభమైంది. తదుపరి మెజారిటీ వాటాను పీఈ సంస్థలు కేదార కేపిటల్‌, పార్టనర్స్‌ గ్రూప్‌ కొనుగోలు చేశాయి. ప్రధానంగా రాజస్తాన్‌, గుజరాత్‌, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్‌లలో విస్తరించింది. 8 రాష్ట్రాల వ్యాప్తంగా 92 జిల్లాలలో 186 బ్రాంచీలను నెలకొల్పింది. రానున్న మూడేళ్లలో బ్రాంచీల సంఖ్యను 300కు పెంచుకోవాలని భావిస్తోంది. 2011లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత గృహ రుణాల మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించింది. రూ. 8 లక్షల సగటు రుణ పరిమాణంలో రిటైల్‌ రుణాలను అందిస్తోంది. లోన్‌బుక్‌లో రాజస్తాన్‌కు 50 శాతం వాటా ఉంది. రుణగ్రహీతల్లో 64 శాతంమంది స్వయం ఉపాధి మార్గంలో ఉన్నవారే కావడం గమనార్హం!Most Popular