మార్కెట్లలో ఈ పతనం ఎప్పుడు ఆగొచ్చు ! డీటైల్డ్ రిపోర్ట్

మార్కెట్లలో ఈ పతనం ఎప్పుడు ఆగొచ్చు ! డీటైల్డ్ రిపోర్ట్

అంతర్జాతీయ ముడి చమురు ధరలు, నానాటికీ తీసికట్టుగా మారుతున్న రూపీ మారకపు విలువ , దేశీయ మార్కెట్లలో మనీ లిక్విడిటీ సమస్యలు ఇవ్వన్నీ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ కంపెనీలు పూర్తిగా పతనం కావడం, మదుపర్ల సంపద ఆవిరైపోడానికి కారణంగా నిలిచాయి.

స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్లు దాదాపు 80 శాతం పడిపోవడంతో  దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయనే చెప్పాలి. స్మాల్ క్యాప్ రంగం మరింత కుంగుబాటుకు గురౌతుందా? మిడ్ క్యాప్ కంపెనీలు రికవరి అయ్యేదెప్పుడు? అసలు ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు ఇలా డీలా పడటానికి కారణాలేంటి. ?
గత త్రైమాసిక ఫలితాలను బట్టి చూస్తే  మార్కెట్ సంక్షోభానికి ప్రధాన కారణాలు:
- అంతర్జాతీయంగా గ్లోబల్ మార్కెట్లు బలపడుతుండటం,  US వడ్డీ రెట్లు పెరగడం, రాను రాను డాలర్ మరింత
    బలపడటం .
-ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడం, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు ఇవి కూడా మార్కెట్ ఒడుదిడుకులకు  
మరో కారణం
-డాలర్ తో రూపీ మారకపు విలువ పడిపోవడం, వడ్డీ రేట్లు పెరగడం.
-దేశంలో రానున్న కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం సార్వత్రిక  
ఎన్నికలు కూడా ఉండటం.
- పబ్లిక్ సెక్టార్ రంగంలోని బ్యాంకుల మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడం.
- లార్జ్ క్యాప్ షేర్ల మార్కెట్ వాల్యూ అంతకంతకూ పెరగడంతో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు పతనం  
- మార్కెట్లను వేధిస్తున్న క్యాష్ లిక్విడిటీ సమస్య


పెను ప్రభావం చూపిన IL&FS పతనం...
దేశీయంగా ఇప్పటికే ద్రవ్య లోటు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనీ లిక్విడిటీ కూడా పెను సమస్యగా మారింది. ఇదే అంశం ప్రధాన కారణంగా నాన్ బ్యాంకింగ్ రంగ సంస్థ IL&FS కుప్ప కూలింది. IL&FS కంపెనీలో ద్రవ్య లభ్యతలో కొరత కారణంగా రుణ మార్కెట్లు దెబ్బతిన్నాయని  మూడీ ఇన్వెస్టర్స్  కంపెనీ పేర్కొంది. అలాగే IL&FS కంపెనీ రేటింగ్స్ ను ICRA పలుమార్లు తగ్గించడంతో ఆ సంస్థ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిణామాల అనంతరం కంపెనీ వేల కోట్ల రూపాయిల బకాయిలను చెల్లించలేక పోవడంతో ప్రభుత్వం కంపెనీని టేకోవర్ చేసుకోవాల్సి వచ్చింది. నాన్ బ్యాంకింగ్ సంస్థలకు క్యాష్ లిక్విడిటీ కొరత కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది కూడా మార్కెట్ సంక్షోభానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్య లభ్యత లేనందునే ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు గరిష్టంగా క్షీణతను చవి చూశాయి. DHFL సంస్థ అత్యధికంగా 60 శాతం నష్టపోయింది. PNB హౌసింగ్స్ 34 శాతం, ఇండియా బుల్స్ 32 శాతం, LIC హౌసింగ్ ఫైనాన్స్ 20 శాతం నష్టపోయాయి.


RBI ప్రకటన ...
ఈ పరిణామాలన్నిటినీ సునిశితంగా గమనిస్తూనే ఉన్నామని, ద్రవ్య లభ్యత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటామని RBI  ప్రకటించడం కాస్త ఊరట నిచ్చే అంశంగా కనబడుతుంది. రెపో రేట్లను కూడా సవరించనున్నామని ఆర్బీఐ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో కాస్త ఆశలు రేకెత్తుతున్నాయి.
మరి కొంత కాలం ఇలాగే...
రానున్న మరి కొద్ది నెలల పాటు మార్కెట్లు నష్టాల బాటలోనే నడవనున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ ఆర్ధిక స్థితి సవ్యంగా ఉన్నా తగు దిద్దుబాటు చర్యలు ఉంటే కొంత పురోగతి కనబడొచ్చని వారంటున్నారు.Most Popular