ఆర్ధిక నేరగాళ్ళ చేతుల్లో బ్యాంకులు విలవిల..

ఆర్ధిక నేరగాళ్ళ చేతుల్లో బ్యాంకులు విలవిల..

భారతీయ ఆర్ధిక వ్యవస్ధను అపహాస్యం చేస్తూ, బ్యాంకింగ్ రంగంలో జరిగిన  అతి పెద్ద మోసాలు.. సామాన్యుడి పెట్టుబడుల విశ్వాసాలను హరించి వేశాయి. బ్యాంకుల విశ్వసనీయతపై ఈ మోసాలు, రుణ ఎగవేతలు పెను ప్రభావాన్ని చూపించాయి. మన దేశంలో జరిగిన బ్యాంక్ కరప్షన్‌ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే....


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -కోల్‌కతా
కొల్‌కతాలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బిపిన్ వోహ్రా, మరియు అతని బృందం రు. 139 కోట్ల రుణాలను ఎగవేసింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి భారీ మొత్తంలో రుణాలను తీసుకున్నారని, పేర్కొన్న విధంగా కాకుండా  వేరే అవసరాలకు నిధులు మళ్ళించారని బిపిన్ వోహ్రాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకూ సెంట్రల్ బ్యాంకుకు రు.139 కోట్ల నిధులు రికవరీ కాకపోవడం గమనార్హం

ఇంటి దొంగలు ...
దాదాపు 10,000ల నకిలీ ఖాతాలను సృష్టించి బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్‌ కామర్స్, IDBI   బ్యాంకు ఉద్యోగులు రు. 150 కోట్ల రుణాలను తీసుకుని వేరే ఖాతాల్లోకి రుణాలను బదిలీ చేశారు.ఈ స్కాం మీద   సీబీఐ కేసులు నమోదు చేసింది.

మేనేజర్ కన్నం... బ్యాంకుకు సున్నం
సెంట్రల్  బ్యాంక్ ఆప్ ఇండియా మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్‌తో కలిసి జైన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ముగ్గురు డైరెక్టర్లు MK.జైన్, రేఖా జైన్ , సునీల్ కుమార్ డాంగీ లు 2015లో బ్యాంకుకు రు.212 కోట్లకు కన్నం వేశారు. సాక్షాత్తు అప్పటి బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వీరితో చేతులు కలిపి బ్యాంకును మోసం చేయడం కలకలం రేపింది. ఈ సొత్తుకూడా ఇంతవరకూ రికవరీ కాలేదని సీబీఐ తెలిపింది.

బ్యాంకులు వీరి సొత్తనుకుంటారు...
2017లో వెలుగు చూసిన కెనరా బ్యాంక్ , విజయా బ్యాంకుల ఉదంతం కూడా సంచలనమే రేపింది. దాదపు రు.290 కోట్ల మేరకు బ్యాంకులను బురిడీ కొట్టించారు కెనరా బ్యాంకు అప్పటి DGM. ఈ డిప్యూటీ బ్యాంకు మేనేజర్, అభిజిత్ గ్రూప్ ప్రమోటర్స్ అయిన మనోజ్ జైశ్వాల్, అభిషేక్ జైశ్వాల్, టీఎల్.పాయ్ లతో కలిసి రు. 290 కోట్ల మేరకు రుణాలను పొందారు. ఈ కేసులో కూడా సీబీఐ నిందితులను అరెస్ట్ చేయగలిగింది కానీ.. డబ్బులను తిరిగి రాబట్టలేక పోయింది.

మరోసారి సెంట్రల్ బ్యాంక్....

2014 లో సెంట్రల్ బ్యాంక్ మరోసారి మోసపోయింది. ఆ బ్యాంకు ఉద్యోగులతో కుమ్ముక్కై అహ్మదాబాద్‌కు చెందిన ఎలక్ట్రోథెర్మ్ ఇండియా కంపెనీ రు. 437 కోట్లకు ఎగనామం పెట్టింది. ఈ కేసులో బ్యాంకు ఉద్యోగులు  కటకటాలు కూడా లెక్కించారు కానీ రికవరీ మాత్రం శూన్యం.

సెంట్రల్ బ్యాంక్ బాటలోనే
పంజాబ్ బ్యాంక్, సింధ్ బ్యాంకు ముంబై శాఖల్లో రు.700 కోట్ల ఫ్రాడ్ జరిగింది. సాక్షాత్తు బ్యాంకు ఉన్నతాధికారులపైనే 7  FIRలను సీబీఐ నమోదు చేసింది.

ఫోర్జరీ దొంగలు- రు.836 కోట్ల దోపిడి
సూరత్‌కు చెందిన సిద్ధి వినాయక లాజిస్టిక్ డైరెక్టర్, బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర కు చెందిన ఉన్నతాధికారి అండతో రు.836 కోట్లను కాజేశారు.2017 లో బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర లో రు.836 కోట్ల రుణాలను ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా తీసుకున్నారీ ప్రబుద్ధులు.  లాజిస్టిక్ కంపెనీ డైరెక్టర్ పద్మాకర్ దేశ్ పాండేను CBI అరెస్ట్ చేసినప్పటికీ కేసు ఇంకా   కొలిక్కి రాకపోవడం విశేషం.

నకిలీ చెక్కులు, ఫేక్ LOCలు...

బ్యాంకు చీఫ్ మేనేజరే నకిలీ చెక్కులు, ఫేక్ LOCలు, నకిలీ LIC పాలసీలను షూరిటీ గా పెట్టి రు. వెయ్యి కొట్లు కొట్టేస్తే... ఎలా ఉంటుంది. సిండికేట్ బ్యాంకులో  అదే జరిగింది. 2016లో సిండికేట్ బ్యాంకు కు చెందిన చీఫ్ మేనేజర్ తో సహా మరో ముగ్గురు నిందితులు బ్యాంకును బోల్తా కొట్టించి రు. 1000 కోట్లను కాజేశారు.  సీబీఐ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసింది. కేసు న్యాయస్థానంలో ప్రస్తుతానికి నిద్రపోతూ ఉంది.


రు. 6000 కోట్లు పాయే....
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , బ్యాంక్ ఆఫ్ బరోడా తో సహా పలు బ్యాంకు అధికారులు రు.6000 కోట్ల నిధులను అక్రమ మార్గంలో విదేశీ డొల్ల కంపెనీలకు చెల్లించారని సీబీఐ కేసులు నమోదు చేసింది. హాంకాంగ్‌కు చెందిన పల్లు డొల్ల కంపెనీలు( సూట్ కేస్ కంపెనీలు)  ఈ బ్యాంకుల ద్వారా అక్రమ విదేశీ చెల్లింపులు పొందాయని ఈడీ ఆరోపించింది.


' బ్రైబ్ ఫర్ లోన్స్  '....
2014లో 'బ్రైబ్ ఫర్ లోన్ స్కాం' ప్రముఖంగా వినిపించిన బ్యాంకు స్కాం. పెద్ద పెద్ద కంపెనీలు , బ్యాంకు చీఫ్ ఆపీసర్స్ కు లంచాలు ఇచ్చి రు. 8000 కోట్ల రుణాలను స్వాహా చేశాయని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఎండీ ఎస్కే జైన్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.

లివింగ్ ఆఫ్ లోన్ టైమ్స్ -కింగ్ ఫిషర్ బ్యాడ్ టైమ్స్
ఇక ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన అతి పెద్ద ఫ్రాడ్ కేసు విజయ్ మాల్యాది.  రు. 9000 కోట్ల రుణాలను తీసుకుని మాల్యా విదేశాలకు పారిపోయాడని ఈడీ ఆరోపించింది. యూకే లో ఉన్న విజయ్ మాల్యా రుణాలను ఎగవేయడానికి చట్టంలోని లూప్ హోల్స్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు. షరా మామూలుగానే సీబీఐ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంది. విజయ్ మాల్యాకు రుణాలను ఇవ్వడానికి ఎకంగా  పలు ప్రముఖ బ్యాంకులు కన్సార్టియంగా ఎర్పడటం కొసమెరుపు.


దొంగ బంగారం... వేల కోట్ల స్కాం..!
కొల్ కతాకు చెందిన గోల్డ్ ట్రేడర్ నీలేష్ పరేఖ్‌ రు. 12,000 కోట్ల మోసాలకు పాల్పడ్డట్టు రెవిన్యూ ఇంటిలిజెన్స్ సంస్థ ఆరోపించింది. 1700 కేజీల దొంగ బంగారాన్ని దిగుమతి చేసుకోవడం, పలు బ్యాంకులను మోసం చేసినట్టు ఈయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుకు ముందు  రు. 2,672 కోట్ల రుణ ఎగవేతలకు సంబంధించి ఈయన అరెస్ట్ అయ్యాడు. బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను అక్రమంగా డొల్ల కంపెనీలు, హవాలా మార్గంలో సింగపూర్, దుబాయి, హాంకాంగ్‌కు తరలించాడని సీబీఐ ఆరోపించింది.  ఈ స్కాం మొత్తం విలువ రు. 12,000కోట్లుగా ఈడీ పేర్కొంది.

విజయ్ మాల్యా అడుగుజాడల్లో నీరవ్ మోడీ
విజయ్ మాల్యా రుణ ఎగవేతలు పలువురు ఆర్ధిక నేరగాళ్ళకు ఆదర్శంగా నిలిచిందేమో... అయన అడుగుజాడల్లో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కూడా నడిచాడు. నీరవ్, ఆయన మామ, తమ్ముడు, భార్య ఇలా కుటుంబం మొత్తం LOU ( లెటర్ ఆఫ్‌ అండర్ టేకింగ్ ) లను అడ్డుపెట్టుకుని ఎకంగా పంజాబ్ నేషనల్ బ్యాంకునే ముంచేసింది. రు. 14,000 కోట్ల నిధులను LOUలను అడ్డం పెట్టుకుని స్వాహా చేసి ఎంచక్కా విదేశాలకు పారిపోయాడు నీరవ్ మోడీ. ఈ స్కాంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నతాధికారులతో బాటు , బ్యాంకు మాజీ డైరెక్టర్లు కూడా అరెస్ట్ అయ్యారు.దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ స్కాంతో ఒక్కసారిగా అథోగతి పాలైంది.

 

 Most Popular