కొటక్‌ బ్యాంక్‌కూ బంధన్‌ బ్యాంక్‌ సెగ!

కొటక్‌ బ్యాంక్‌కూ బంధన్‌ బ్యాంక్‌ సెగ!

ఇటీవల మొండిబకాయిలకుతోడు పలు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకింగ్‌ రంగంలో మరో కుదుపు ఏర్పడింది. యస్‌ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ పదవీ కాలాన్ని కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా ప్రయివేట్ రంగ మరో సంస్థ బంధన్‌ బ్యాంక్‌పై కన్నెర్ర చేసింది. ఎండీ, సీఈవో చంద్ర శేఖర్‌ ఘోష్‌కు రెమ్యునరేషన్‌ చెల్లింపులను నిలిపివేయమంటూ బంధన్‌ బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోపక్క ప్రమోటర్‌ వాటాను తగ్గించుకోవలసిన గడువు డిసెంబర్‌లోగా ముగియనుండటంతో ఈ అంశంలో విఫలమైతే.. ప్రయివేట్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై సైతం ఆర్‌బీఐ చర్యలు తీసుకునే వీలున్నట్లు ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ఈ కౌంటర్‌ ఇటీవలలేని విధంగా తొలుత 10 శాతం పతనంకావడం గమనార్హం! వివరాలు చూద్దాం..

బంధన్‌ బ్యాంక్‌
బ్యాంకులో నిర్వహణేతర ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ(ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతం దిగువకు తగ్గించుకోవడంలో విఫలంకావడంతో ఆర్‌బీఐ తాజాగా బంధన్‌ బ్యాంకుపై సీరియస్‌ అయ్యింది. సీఈవోకు రెమ్యునరేషన్ చెల్లింపులను ప్రస్తుతానికి నిలిపివేయమంటూ బంధన్‌ బ్యాంకును ఆర్‌బీఐ తాజాగా ఆదేశించింది. అంతేకాకుండా కొత్తగా బ్రాంచీల ఏర్పాటుకు చెక్‌ పెట్టింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్తువెత్తాయి. అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవు కావడంతో బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 113 పతనమై రూ. 452 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఈ ఏడాది మార్చి27న లిస్టయ్యాక బంధన్‌ బ్యాంక్‌ షేరు చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. లిస్టింగ్‌ ధర రూ. 741తో పోలిస్తే ఇప్పటివరకూ 39 శాతం క్షీణించింది.

Image result for kotak mahindra bank

కొటక్‌ బ్యాంక్‌
కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వైస్‌చైర్మన్‌, ఎండీ ఉదయ్‌ కొటక్‌కు ప్రస్తుతం బ్యాంకులో 30.03 శాతం వాటా ఉంది. అయితే డిసెంబర్‌లోగా ఉదయ్‌ కొటక్‌ వాటాను 20 శాతంలోపునకు పరిమితం చేసుకోవలసి ఉంది. ప్రస్తుతం కఠిన చర్యలు చేపడుతున్న రిజర్వ్‌ బ్యాంక్‌ వాటాను తగ్గించుకునే విషయంలో తదుపరి గడువు పొడిగింపునకు అనుమతించకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో మూడు నెలల్లోగా ఉదయ్‌ కొటక్‌ వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు వేగవంతం చేయవలసి ఉంటుందని తెలియజేశారు. 
షేరు 10 శాతం డౌన్‌
తాజా అంశాల నేపథ్యంలో కొటక్‌ మహీంద్రా బ్యాంకు కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం కుప్పకూలింది. రూ. 1002 వరకూ జారింది. తదుపరి కొంతమేర కోలుకుంది. ప్రస్తుతం దాదాపు 5 శాతం వెనకడుగుతో 1086 వద్ద ట్రేడవుతోంది.  Most Popular