అమ్మకాల ఫీవర్‌- మార్కెట్ల పతనం!

అమ్మకాల ఫీవర్‌- మార్కెట్ల పతనం!

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల ఫీవర్‌ సోకింది. తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి ప్రవేశించాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 536 పాయింట్లు పతనమై 36,305కు చేరగా.. నిఫ్టీ 168 పాయింట్లు దిగజారి 10,975 వద్ద నిలిచింది. తద్వారా  నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌ దిగువన స్థిరపడింది. నేటి నుంచి అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకిరానున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం! ఆసియాలో ప్రధాన మార్కెట్లు జపాన్‌, చైనా, కొరియా, తైవాన్‌లకు నేడు సెలవు. 

టీసీఎస్‌ హైజంప్‌
డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఎన్‌ఎస్ఈలో ఐటీ మాత్రమే(2.3 శాతం) బలపడింది. మిగిలిన అన్ని రంగాలూ వెనకడుగు వేశాయి. రియల్టీ 5.5 శాతం, ఆటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 4-2 శాతం మధ్య పతనమయ్యాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, ఐషర్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్, అదానీ పోర్ట్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌ 7-3-4 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టీసీఎస్‌ 5 శాతం జంప్‌చేయగా, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. 

Image result for thumns down

చిన్న షేర్లు పతనం
అమ్మకాలు పెరగడంతో మార్కెట్లను మించుతూ చిన్న షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2.5 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 2107 నష్టపోగా.. 549 మాత్రమే లాభపడ్డాయ్‌.

పెట్టుబడులవైపు...
నగదు విభాగంలో శుక్రవారం(21న) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 761 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 497 కోట్ల విలువైన స్టాక్స్‌ నికరంగా కొనుగోలు చేశాయి. Most Popular