500 పాయింట్లు డౌన్‌- ఐటీ ఎదురీత

500 పాయింట్లు డౌన్‌- ఐటీ ఎదురీత

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల ఫీవర్‌ సోకింది. తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాలలోకి ప్రవేశించింది. ప్రస్తుతం మరింత పతనమైంది. సెన్సెక్స్‌ 511 పాయింట్లు పతనమై 36,330కు చేరగా.. నిఫ్టీ 162 పాయింట్లు దిగజారి 10,981 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 11,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నేటి నుంచి అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకిరానున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం! ఆసియాలో ప్రధాన మార్కెట్లు జపాన్‌, చైనా, కొరియా, తైవాన్‌లకు నేడు సెలవు.

ఐటీ ఎదురీత
డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటంతో ఎన్‌ఎస్ఈలో ఐటీ మాత్రమే (2.3 శాతం) బలపడింది. మిగిలిన అన్ని రంగాలూ వెనకడుగులో ఉన్నాయి. రియల్టీ 5 శాతం, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఫార్మా 3-2 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, ఐషర్, ఇండస్‌ఇండ్, లుపిన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 7-3.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌, హిందాల్కో, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌, ఓఎన్‌జీసీ 3.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో దివాన్‌ హౌసింగ్‌ 12 శాతం, ఇన్ఫీబీమ్ 10 శాతం చొప్పున దూసుకెళ్లగా..  జీఎంఆర్‌, నిట్‌ టెక్‌, ఐజీఎల్‌, పీసీ జ్యువెలర్స్‌ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క మదర్‌సన్ సుమీ, కేన్‌ఫిన్‌, ఐఆర్‌బీ, డీఎల్‌ఎఫ్‌, ఆర్‌ఈసీ, రెప్కో హోమ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 9-7 శాతం మధ్య పడిపోయాయి. రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్‌, ఒబెరాయ్‌, ఫీనిక్స్‌, యూనిటెక్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌, శోభా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 10-2 శాతం మధ్య తిరోగమించాయి.

Image result for falling down graph

చిన్న షేర్లు పతనం
అమ్మకాలు పెరగడంతో మార్కెట్లను మించుతూ చిన్న షేర్లు పతనబాట పట్టాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 2113 నష్టపోగా.. 457 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.Most Popular