గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవో షురూ

గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీవో షురూ

ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ సోమవారం(24న) ప్రారంభంకానుంది. బుధవారం(26న) ముగియనున్న ఇష్యూకి ప్రైస్‌-బ్యాండ్‌ షేరుకి రూ. 115-118కాగా.. తద్వారా కంపెనీ రూ. 340 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 2.92 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది.

120 షేర్లు ఒక లాట్‌
మినీరత్న కంపెనీ (జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Image result for Garden Reach Shipbuilders

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్‌ చేసిన జీఆర్‌ఎస్‌ఈ లిమిటెడ్‌ ప్రధానంగా దేశ నావికా దళం, తీరప్రాంత రక్షణ విభాగాలకు అవసరమయ్యే ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఆధునిక, వ్యూహాత్మర వార్‌షిప్పులను తయారు చేస్తోంది. వీటిలో ఫ్రైగేట్స్‌, ఫ్లీట్‌ ట్యాంకర్లు, సర్వే వెస్సల్స్‌, ఆఫ్‌షోర్‌, ఆన్‌షోర్‌ ప్యాట్రోల్‌ వెస్సల్స్‌, హోవర్‌ క్రాఫ్ట్స్‌ తదితరాలను రూపొందిస్తోంది. అంతేకాకుండా పోర్టబుల్‌ ప్రీఫ్యాబ్రికేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జిలు, మెరైన్‌ పంపులు, డీజిల్‌ ఇంజిన్లు, వార్‌షిప్పులకు అవసరమయ్యే డెక్ మెషీనరీలను సైతం తయారు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 20,803 కోట్లుకాగా.. దేశ నావికాదళం నుంచే దాదాపు 99 శాతం ఆర్డర్లు లభించినట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 

ఇతర వివరాలు
పటిష్ట మౌలిక సౌకర్యాలకుతోడు కంపెనీ ఇటీవల పలు ఆధునిక హంగులను సమకూర్చుకుంది. 2013లో కొత్తగా సమీకృత షిప్‌ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా వార్‌షిప్పుల తయారీలో మాడ్యులర్‌ కన్‌స్ట్రక్షన్‌కు వీలుచిక్కింది. డ్రైడాక్‌, బెర్త్‌ల బిల్డింగ్‌ వంటి కార్యక్రమాలకు వీలుగా కొత్త హల్‌ షాప్‌, మాడ్యూల్‌ షాపులను నెలకొల్పింది. తరటాలాలో ఆధునిక పంప్‌సెట్‌ బెడ్‌ సౌకర్యాన్నీ ఏర్పాటు చేసింది. చిన్న నౌకల నిర్మాణానికి వీలుగా రాజబగన్‌ డాక్‌యార్డ్‌ను అభివృద్ధి చేసింది. రాంచీలోని డీఈపీ యూనిట్‌ను 2016లో ఆధునీకరించింది.   Most Popular